Sakshi News home page

ఇక కండక్టర్లు లేకుండానే..

Published Tue, Jul 5 2016 12:43 AM

ఇక కండక్టర్లు లేకుండానే..

- బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం
- దశల వారీగా ‘టిమ్’ సర్వీసుల ఏర్పాటుకు ప్రణాళిక
- టికెట్లు జారీ చేయనున్న డ్రైవర్లు
 
 సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల విధానానికి మంగళం పాడాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక కొత్తగా రోడ్లపైకి వచ్చే బస్సులను వీలైనంతవరకు పూర్తిగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) సర్వీసులుగా మార్చాలని నిర్ణయించింది. ఈ సర్వీసుల్లో డ్రైవర్లే యంత్రాలతో టికెట్లు జారీ చేస్తారు. తొలుత ఒక్క సిటీ సర్వీసుల్లో తప్ప మిగతా అన్ని బస్సులను టిమ్ సర్వీసుల పరిధిలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. త్వరలో 1,200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, గరుడ, సూపర్ లగ్జరీ, డీలక్స్ వంటి సర్వీసుల్లోనే డ్రైవర్లు టిమ్ యంత్రాలతో టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ వాటిని వాడుతున్నారు. సిటీ సర్వీసులు, పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం కండక్టర్లు టికెట్లు జారీ చేస్తున్నారు. క్రమంగా పల్లెవెలుగు బస్సుల్లో కూడా టిమ్‌లను ప్రవేశపెట్టి డ్రైవరే టికెట్లు జారీ చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకోబోతోంది.

 మినీ బస్సులతో మొదలు..
 ప్రస్తుతం ఉన్న పాత బస్సులను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త మార్గాల్లో బస్సులను తిప్పేందుకు 1,200 బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొన్ని మార్గాల్లో పెద్ద బస్సులకు సరిపడా ప్రయాణికులు లేక ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. దీంతో ఆ మార్గాల్లో బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ.. ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి ప్రాంతాలకు చిన్న బస్సులను నడపాలని నిర్ణయించారు. తొలిదశలో దాదాపు 110 మినీ బస్సులు నడపాలని నిర్ణయించిన అధికారులు.. బస్సులు కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత వీటిని టిమ్ సర్వీసులుగా నడపనున్నారు. తర్వాత పల్లెవెలుగు బస్సుల్లో కూడా కండక్టర్లను తొలగించి డ్రైవర్లకే టికెట్లు జారీ చేసే బాధ్యత అప్పగిస్తారు.

 ఏటా రూ.3 వేల కోట్ల భారం
 ప్రస్తుతం ఆర్టీసీలో 23 వేల మందికిపైగా కండక్టర్లున్నారు. ఇటీవల వేతనాలను భారీగా పెంచడంతో ఆర్టీసీపై ఆర్థిక భారం పడింది. మొత్తం వేతనాల ద్వారా ఏడాదికి రూ.3 వేల కోట్ల వరకు భారం పడుతున్నందున, అందులో కండక్టర్ల ఖర్చును దశలవారీగా తగ్గించుకోవాలని చూస్తోంది. నాలుగేళ్లుగా కండక్టర్ల నియామకాలు జరపటం లేదు. కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక పదవీ విరమణ చేసిన వారు పోను మిగతా వారిని ఇతర పనులకు మళ్లించే ఆలోచన చేస్తోంది.
 
 స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టే యోచన
 కండక్టర్లతో సంబంధం లేకుండా, డ్రైవర్లు కూడా టికెట్టు జారీ చేసే అవసరం లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకోసం ప్రీ పెయిడ్ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రయాణికులు ప్రీ పెయిడ్ స్మార్ట్ కార్డు కొనాల్సి ఉంటుంది. బస్సుల్లో వీటి కోసం కార్డ్ రీడర్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు బస్సు ఎక్కేప్పుడు, దిగేప్పుడు సెన్సార్ల ద్వారా కార్డు స్వైప్ అవుతుంది. దీంతో సదరు వ్యక్తి ప్రయాణించిన దూరానికి నిర్ధారిత మొత్తం కార్డు నుంచి డిడక్ట్ అవుతుంది. కార్డును రీడర్ ముందుంచాల్సిన అవసరం లేకుండా జేబులో ఉన్నా రికార్డయ్యేలా సెన్సార్లు అందులో ఉంటాయి. వీటిని తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆర్టీసీ పరిశీలిస్తోంది.

Advertisement
Advertisement