'నయీంను పెంచింది వాళ్లు.. అంతం చేసింది మేము' | Sakshi
Sakshi News home page

'నయీంను పెంచింది వాళ్లు.. అంతం చేసింది మేము'

Published Tue, Aug 23 2016 11:42 AM

'నయీంను పెంచింది వాళ్లు.. అంతం చేసింది మేము'

నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిశోర్, ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని, ఇప్పుడు తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యామని గాదరి కిశోర్ చెప్పారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. అహంకార ధోరణితో తమపై నిరాధార ప్రేలాపనలు చేస్తున్నారని, పిచ్చికూతలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ప్రజలే బట్టలూడదీసి కొడతారని.. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇదే తమ హెచ్చరిక అని కిశోర్ అన్నారు.

ఇక నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయని చెప్పడం వాళ్ల అవివేకం అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ పదేళ్లు పెంచి పోషించిన క్రూరమృగాన్ని అంతంమొందించింది ఎవరో అందరికీ తెలుసని, నయీం ముచ్చట వాళ్లు ఊరికే మాట్లాడుతున్నారని చెప్పారు. నయీంతో తమకు హాని ఉన్న విషయాన్ని నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆ నేతలే అన్నారని.. అలాంటి క్రూరమృగాన్ని అంతమొందించింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను ప్రజల మెప్పును పొందుతుంటే ఓర్వలేక ఇలా చెబుతున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకం లేదు గానీ అధికారుల మీద నమ్మకం ఉందని చెబుతున్నారని.. ఆ అధికారులను ఆ స్థానంలో పెట్టింది కేసీఆరేనని మర్చిపోకూడదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఎంతో హైప్ ఉన్న ప్రధానమంత్రి మోదీ కూడా కేసీఆర్ గురించి గొప్పగా ప్రశంసించారని, కేసీఆర్ ఇంత బాగా పనిచేస్తుంటే పచ్చకామెర్ల రోగిలా మాట్లాడుతుంటే బాధాకరమని ఆయన అన్నారు. మీకు హైప్ వచ్చిందో, అయిపోవచ్చిందో ప్రజలే ఆలోచించుకుంటారని, వాళ్లు చైతన్యవంతులని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమైనా అనుమానాలుంటే సిట్ అధికారులకు ఒక దరఖాస్తు ఇవ్వడమో, ఫోన్ చేసి చెప్పడమో చేయాలని సూచించారు. పొరపాటు ఎవరు చేసినా చట్టానికి అతీతులు కారని.. ఎవరు తప్పుచేసినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement