సృజనాత్మకతకు మారుపేరు.. టైల్ డిజైనింగ్! | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతకు మారుపేరు.. టైల్ డిజైనింగ్!

Published Sat, Aug 23 2014 12:12 AM

సృజనాత్మకతకు మారుపేరు.. టైల్ డిజైనింగ్!

గదికి అందాన్ని, చూపరులకు ఆహ్లాదాన్ని కలిగించేవి.. వర్ణరంజితమైన టైల్స్. ఇవి ఒకప్పుడు సౌకర్యం కోసం మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా మారిపోయాయి. నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, ఫుట్‌పాత్‌లు... అనే తేడా లేకుండా అన్నిచోట్లా టైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెల్లోనూ వీటి వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో టైల్ డిజైనర్లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. సృజనాత్మకత కలిగిన డిజైనర్లకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పూర్తి భరోసా లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
 
అవకాశాలు, ఆదాయం

భారత్‌లో టైల్ డిజైనింగ్ పరిశ్రమల్లో డిజైనర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలు కూడా వీరిని నియమించుకుంటున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా డిజైనింగ్ సంస్థను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం ఆర్జించడానికి వీలుంటుంది. ఉన్నత విద్యార్హతలు లేకపోయినా సృజనాత్మకత, శ్రమకు వెనుకాడని తత్వం ఉంటే టైల్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకోవచ్చు. వినియోగదారులకు సంతృప్తి కలిగించే డిజైన్లను సృష్టించగలిగే ప్రతిభ ఉంటే అవకాశాలకు లోటే ఉండదు.

కావాల్సిన స్కిల్స్: టైల్ డిజైనర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పెంచుకోవాలి. ఈ రంగంలో ప్రపంచస్థాయిలో వస్తున్న మార్పులను, మార్కెట్ అవసరాలను, వినియోగదారుల అభిరుచులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తదనుగుణంగా నూతన డిజైన్లను సృష్టించగలగాలి. ఫోటోషాప్, కోరల్‌డ్రా వంటి సాంకేతికాంశాలను నేర్చుకోవాలి. మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
 
అర్హతలు
: మనదేశంలో ఫైన్ ఆర్ట్స్/డిజైనింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్సుల్లో భాగంగా టైల్ డిజైనింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్మీడి యెట్‌లో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. సిరామిక్ ఇంజనీరింగ్ కోర్సు చదివినవారు కూడా టైల్ డిజైనర్‌గా స్థిరపడొచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఔత్సాహికులకు దీనిపై శిక్షణ ఇస్తున్నాయి.
 
వేతనాలు
: టైల్ డిజైనింగ్ సంస్థలో ట్రైనీకి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే రూ.40 వేలకు పైగానే పొందొచ్చు. సొంతంగా డిజైనింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకొని, కష్టపడి పనిచేస్తే ఆదాయానికి ఆకాశమే హద్దు.
 
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
కాలేజీ ఆఫ్ ఆర్ట్-ఢిల్లీ
వెబ్‌సైట్: http://delhi.gov.in/
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
వెబ్‌సైట్: www.nid.edu
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
వెబ్‌సైట్: www.nift.ac.in/Delhi/
సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై
వెబ్‌సైట్: www.sirjjschoolofart.in
ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా
వెబ్‌సైట్: www.msubaroda.ac.in
 
సరికొత్తగా డిజైన్ చేయాలి!


శ్రీటైల్ డిజైనింగ్ కోర్సులను ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా నేర్చుకుంటారు. సృజనాత్మకత ఉన్నవారు టైల్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధిస్తే అవకాశాలకు కొదవలేదు.  వివిధ ప్యాట్రన్స్‌పై అవగాహన ఉండి, సరికొత్తగా డిజైన్ చేసే సత్తా ఉంటే  కెరీర్‌లో సులభ ంగా రాణించొచ్చు. అనుభవం, వ్యక్తిగత నైపుణ్యాలను బట్టి వేతనాలు మారుతుంటాయి. టైల్ డిజైనింగ్‌లో నైపుణ్యం పొందిన వారు సొంతంగా కూడా నివాస గృహ నిర్మాణాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. టైల్స్ విక్రయ మార్కెట్‌లోకి ప్రవేశించొచ్చ్ణు

 - వి. హరిప్రియ, చీఫ్ ఆర్కిటెక్ట్,
 కర్వ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement