నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక! | Sakshi
Sakshi News home page

నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక!

Published Tue, Aug 16 2016 2:06 AM

నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక! - Sakshi

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తమ నివేదికను సమర్పించనుంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్యర్యంలోని సబ్‌కమిటీ వరుసగా మూడు రోజుల పాటు అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లతో భేటీ అయింది. జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల విభజన అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైంది. వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులన్నింటినీ క్రోడీకరించి సబ్ కమిటీ నివేదికను రూపొందించింది.

‘జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలన్నీ తెలుసుకున్నాం. అందరి విజ్ఞప్తులు, ప్రజాభిప్రాయాలతో నివేదికను సిద్ధం చేశాం. మంగళవారం ముఖ్యమంత్రిని కలసి ఈ నివేదికను అందజేయాలనుకుంటున్నాం..’ అని మహమూద్ అలీ సోమవారం వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదని, 24 ఉండాలా.. కొత్తగా వచ్చిన డిమాండ్లతో 26కు పెంచాలా.. అన్నది తేలలేదన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విషయంలోనే పీటముడి ఉందని, ఆ వివాదం కూడా త్వరలో సమసిపోతుందని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలున్నాయి. దానికి బదులు మరో జిల్లాను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ తమ నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసింది.

ఇక జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లాగా చేయాలని ఆ ప్రాంత ప్రతినిధులు పట్టుబట్టారు. ఈ రెండు ప్రతిపాదనలను కూడా సబ్ కమిటీ నివేదికలో పొందుపరచనున్నట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాపై ప్రజా ప్రతినిధుల భేటీలో చర్చ జరగకపోవడం, నిర్మల్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో... సబ్ కమిటీ ఈ రెండింటిని నామమాత్రంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

ఇక జోనల్ వ్యవస్థను రద్దు అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు నివేదికలో ఉండనున్నాయి. ముందుగా ఈనెల 16న అఖిల పక్ష సమావేశం, 17న కలెక్టర్లతో సబ్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే సీఎంతో సబ్ కమిటీ అనంతరమే ఈ రెండు సమావేశాలపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement