ముప్పై రెండు కాదు... ఇరవై ఎనిమిదే! | Sakshi
Sakshi News home page

ముప్పై రెండు కాదు... ఇరవై ఎనిమిదే!

Published Sun, Mar 6 2016 3:41 AM

దంతాల పనితీరు గురించి వివరిస్తున్న డాక్టర్ చంద్రకాంత్‌రావు

కొడితే 32 పళ్లు రాలాలి అంటుంటారు.. కానీ ఇప్పుడు చాలా మందికి 32 పళ్లు ఉండడం లేదు. యుక్త వయసు వచ్చినా 28 దంతాలే ఉంటున్నాయి. భారత డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆహారాన్ని మొత్తగా నమలకుండా మింగడం, తాజా పండ్లు, కాయలకు బదులు నోట్లో వేసుకోగానే కరిగిపోయే చాక్లెట్లు, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల నోటి పరిమాణం తగ్గిపోయి జ్ఞాన దంతాలు పుట్టడం లేదని సర్వే పేర్కొంది.
 
మనుషుల్లో తగ్గిపోతున్న దంతాల సంఖ్య
భారత డెంటల్ అసోసియేషన్ సర్వేలో వెల్లడి
నోటికి వ్యాయామం లేక కుదించుకుపోతున్న దవడలు
ఆహారం నమిలే అలవాటు లేకే జ్ఞాన దంతాలకు ఆటంకం
దంత కేన్సర్‌లో మూడో స్థానంలో హైదరాబాద్.. నేడు వరల్డ్ డెంటల్ డే


సాక్షి, హైదరాబాద్: చిన్న వయసులో పాల దంతాలు వస్తాయి. ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్యలో అవన్నీ ఊడిపోయి కొత్త దంతాలు వస్తాయి. పైన కింద కలిపి ఇవి ఇరవై ఎనిమిది ఉంటాయి. ఆ తర్వాత యుక్త వయసులో దవడల చివరన మరో నాలుగు దంతాలు (జ్ఞాన దంతాలు) వస్తాయి. కానీ చిన్న వయసులో ఆహారాన్ని ఎక్కువగా నమిలే అలవాటు లేకపోవడం, నమలాల్సిన అవసరం లేని ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్ల వంటివి ఎక్కువగా తినడం వల్ల నోటికి సరైన వ్యాయమం ఉండటం లేదు.

దీంతో దవడలు కుచించుకుపోయి జ్ఞాన దంతాలు రావడం లేదని ఐడీఏ సర్వేలో వెల్లడైంది. నేటితరం యువతలో చాలా మందికి జ్ఞాన దంతాలు కన్పించకపోవడంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఉన్నా... అవి ఎగుడు దిగుడుగా ఉండటం, చిగుళ్లలోకి చొచ్చుకుపోయినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం యువతకు వస్తున్న 60 శాతం తలనొప్పులకు ఇదే కారణమని స్పష్టం చేసింది. అంతేకాదు ఆహారాన్ని ఎక్కువగా నమలకుండా మింగేయడం వల్ల నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతోంది. తద్వారా ‘హెచ్‌పైలోరే’ అనే బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరి అజీర్తి, అల్సర్లకు కారణమవుతోంది.
 
దంత కేన్సర్‌లో హైదరాబాద్‌కు మూడో స్థానం
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో దంత కేన్సర్ ఎక్కువగా నమోదవుతోంది. పొగాకు ఉత్పత్తులు, జర్దా, పాన్, గుట్కాలు ఎక్కువగా నమలడమే అందుకు కారణం. దంత కేన్సర్ బాధితుల్లో హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇందులో అహ్మదాబాద్, ముంబై తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
 
నమిలి మింగకపోవడం వల్లే..

‘‘ఆహారాన్ని నమిలి మింగే అలవాటు లేకపోవడం వల్ల దవడల పరిమాణం తగ్గిపోతున్నట్లు ఐడీఏ సర్వేలో తేలింది. 16 ఏళ్లు దాటిన చాలా మందిలో జ్ఞాన దంతాలు కన్పించకపోవడానికి ఇదే ప్రధాన కారణం. జ్ఞాన దంతాలు వచ్చినా స్థలాభావం వల్ల ఒకదానిపై మరొకటి అంటిపెట్టుకుని ఉంటున్నాయి. ఏదైనా నమిలినప్పుడు ఇవి చిగుళ్లకు గుచ్చుకుని పంటి, తలనొప్పికి కారణమవుతున్నాయి’’
 - డాక్టర్ చంద్రకాంత్‌రావు, ఇండియన్ డెంటిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు

Advertisement
Advertisement