నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణ

Published Mon, Jun 6 2016 3:20 AM

నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణ - Sakshi

న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, లాయర్ల జేఏసీ నిర్ణయం
10 వరకు విధుల బహిష్కరణ
13న చలో హైకోర్టుకు పిలుపు

 సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపు వివాదం మరింత ముదురుతోంది. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేస్తున్న న్యాయాధికారుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సోమవారం నుంచి ఈ నెల 10 వరకు వరకు కోర్టు విధులను బహిష్కరించాలని న్యాయాధికారులు, న్యాయ శాఖ ఉద్యోగ సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ నిర్ణయించాయి. 13న సంయుక్తంగా చలో హైకోర్టు నిర్వహించాలని తీర్మానించా యి. న్యాయమూర్తులకు సంబంధించిన ప్రిలిమినరీ కేటాయింపును వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆదివారం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో సమావేశమయ్యారు.

స్థానికత ఆధారంగానే న్యాయాధికారుల కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు. ప్రిలిమినరీ కేటాయింపులు అమలైతే న్యాయాధికారుల ఉద్యోగాలను న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు(20శాతం కోటా) కోల్పోవాల్సి వస్తుం దని, ఈ కేటాయింపులతో 20 ఏళ్ల వరకు ఒక్క న్యాయాధికారి కూడా హైకోర్టు న్యాయమూర్తి అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ నెల 13 లోగా ప్రిలిమినరీ కేటాయింపులు రద్దు చేయకపోతే.. న్యాయ శాఖ ఉద్యోగులంతా సామూహికంగా సెలవు పెట్టేందుకు అనుమతించాలని హైకోర్టును కోరాలని నిర్ణయించారు. తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు, న్యాయాధికారులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటానికి దిగడం గమనార్హం.

 సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిరావు లక్కరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య, న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రసాద్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి, తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి, రమణారావు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో-కన్వీనర్ శ్రీరంగరావు, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement