హక్కులను హరిస్తుంటే సహించం | Sakshi
Sakshi News home page

హక్కులను హరిస్తుంటే సహించం

Published Mon, Sep 12 2016 1:46 AM

హక్కులను హరిస్తుంటే సహించం - Sakshi

 మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా  పోరాటం: ఉత్తమ్
 ఇందిరాపార్కు వద్ద  పీసీసీ ధర్నా
 
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి పేద రైతులు, కూలీలు, ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వమే కాలరాస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు వంద రోజులు దీక్ష చేసిన నేపథ్యంలో సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు.

మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఉత్తమ్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, నాయకులు సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎం.కోదండ రెడ్డి హాజరయ్యారు.
 
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత నల్లా సూర్యప్రకాశ్ తదితరులు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వం పేద ప్రజలను గ్రామాల నుంచి పోలీసులతో, రెవెన్యూ అధికారులతో తరిమివేస్తున్నదని విమర్శించారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు చేపట్టాలని రైతులు పోరాడుతున్నా.. ప్రభుత్వం నిర్బంధం విధించి, పోలీసులతో కేసులు పెట్టి, బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
 
భూ సేకరణ చేయకుండా, బెదిరించి కొనుగోలు చేస్తున్నదన్నారు. దీనివల్ల భూమి లేని పేదలకు, భూమిపై ఆధారపడిన వృత్తిదారులు, కూలీలకు పునరావాసం లేకుండా పోతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయకుండా, బలవంతపు భూ సేకరణతో హక్కులను హరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ప్రకటించారు. జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మల్లన్న సాగర్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, రైతులపై కేసులు పెట్టి వేధించడంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటామన్నారు.
 
అప్రజాస్వామికంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రె స్ అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ కింద భూములు పోగొట్టుకున్న రైతులకు తిరిగి అప్పగిస్తామని జైపాల్‌రెడ్డి అన్నారు. ఇచ్చే పరిస్థితి లేకపోతే భూ సేకరణ చట్టం-2013 కింద పరిహారం అందచేస్తామన్నారు.

వైఎస్సార్‌సీపీ రైతు సంఘం అధ్యక్షుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ 27 నెలల కేసీఆర్ పాలన అబద్ధాలతోనే సాగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌ల సొంత జిల్లాలలోనే వంద రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక సంప్రదాయాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. వీటిపై ప్రజల పక్షాన జరిగే పోరాటాలకు అండగా ఉంటామని తెలిపారు.
 
నేడు గవర్నర్‌ను కలవనున్న పీసీసీ
మల్లన్న సాగర్‌లో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడంపై గవర్నర్‌కు పీసీసీ సోమవారం ఫిర్యాదు చేయనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందజేయనున్నారు. అనంతరం గజ్వేల్‌లో జరిగే మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావ సభకు హాజరు కావడానికి బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement
Advertisement