నిర్వాసితులకు బాసట: ఉత్తమ్ | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు బాసట: ఉత్తమ్

Published Tue, Jun 21 2016 2:55 AM

నిర్వాసితులకు బాసట: ఉత్తమ్ - Sakshi

నేడు మల్లన్నసాగర్‌కు టీపీసీసీ బృందం
 
 సాక్షి, హైదరాబాద్: భూనిర్వాసితులకు న్యాయం జరిగే దాకా పోరాడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో ఉల్లంఘనలపై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కడానికి, రైతుల నుంచి అన్యాయంగా భూమిని తీసుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 తెచ్చిందని దుయ్యబట్టారు. ఈ సమావేశం వివరాలను పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి మీడియాకు వివరించారు.

తాము ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వారికి న్యాయం జరిగేదాకా పార్టీ అండగా ఉంటూ పోరాటం చేస్తుందన్నారు. మల్లన్నసాగర్‌లో భూమి కోల్పోతున్నవారితో మాట్లాడటానికి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంగళవారం టీపీసీసీ సబ్‌కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ నేతృత్వంలో కమిటీ పర్యటిస్తుందని వెల్లడించారు. సబ్‌కమిటీ సమావేశంలో పార్టీ నేతలు దామోదరతోపాటు డీకే అరుణ, ఎం.కోదండరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 ఉత్తమ్‌కు గవర్నర్ శుభాకాంక్షలు
 టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో వేడుకలు జరిగాయి. పార్టీ నేతలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలను తెలియజేశారు. గవర్నర్ నరసింహన్ కూడా ఉత్తమ్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలను తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement