గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ రద్దు? | Sakshi
Sakshi News home page

గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ రద్దు?

Published Sat, Dec 5 2015 10:21 AM

గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ రద్దు? - Sakshi

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ) నాయకత్వం ఉంది. గ్రేటర్ కాంగ్రెస్ నుంచి నాయకుల వలసలు పెరిగే అవకాశాలున్నాయన్న సమాచారంతో టీపీసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైన తరుణంలో టీపీసీసీ నాయకత్వంలో కదలిక వచ్చింది.

కమిటీలో కొనసాగుతున్న నాయకులు వెళ్లిపోవడం వల్ల పార్టీ బలహీనపడిందన్న అభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తున్న టీపీసీసీ ముందుగానే ఆ కమిటీని పూర్తిగా రద్దుచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కమిటీని రద్దు చేయడం వల్ల రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసే పనిలో టీపీసీసీ నేతలు తలమునకలయ్యారు. దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందే కమిటీని రద్దు చేయడం మంచిదని పలువురు నేతలు ఒత్తిడి తెస్తుండటంతో టీపీసీసీ నేతలు ఈ విషయంపై హైకమాండ్‌ను ఆశ్రయించారు.

టీఆర్‌ఎస్‌లో చేరాలన్న నిర్ణయానికి వచ్చిన దానం కమిటీ అధ్యక్షుడిగా ఇంకా కార్యక్రమాలు కొనసాగించే ఆస్కారం కల్పించడం పార్టీకి నష్టం చేకూర్చుతుందని, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గ్రేటర్ కమిటీని రద్దు చేయడమే మంచిదని ఏఐసీసీకి నివేదించారు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి తగిన ఆదేశాలు రావొచ్చని టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రస్తుత కమిటీని రద్దు చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కోసం తాత్కాలికంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టీపీసీసీ నేతలు ఉన్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement