దివ్యాంగుల శిక్షణకు కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల శిక్షణకు కార్యక్రమాలు

Published Sat, Feb 11 2017 3:56 AM

దివ్యాంగుల శిక్షణకు కార్యక్రమాలు - Sakshi

‘వింధ్య ఈ ఇన్ఫో మీడియా’ కాల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగులకు ఉపాధి కల్పన, శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. దివ్యాంగులకు మాత్రమే పెద్ద పీట వేస్తూ ఉద్యోగాలు కల్పించే ‘వింధ్య ఈ ఇన్ఫో మీడియా’ కాల్‌ సెంటర్‌ను శుక్రవారం బేగం పేటలో మంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడి ఉద్యోగుల పని తీరును పరిశీలించిన కేటీఆర్‌.. దివ్యాంగులు ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా పని చేస్తున్నారని కొనియాడారు.

బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తు న్న ఈ సంస్థ తాజాగా హైదరాబాద్‌కు విస్తరించి, కేవలం దివ్యాంగులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించడం, వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ, ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన దివ్యాంగులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అనేక ఐటి కంపెనీలు రెడీగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కూడా ఉన్నారు.

దివ్యాంగుల శిక్షణ కోసం ‘టాస్క్‌’
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు రంగాలు, పాలసీలు, పథకాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ఇప్పుడు దివ్యాంగుల ఉపాధి కోసం ప్రత్యేకమైన విధానాలు రూపొందించి, శిక్షణ కోసం టాస్క్‌ ద్వారా పలు కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి ఏం కావాలని కేటీఆర్‌ అడగ్గా.. శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తే చాలని అక్కడ ఉద్యోగం పొందిన బీటెక్‌ యువతి సుల్తానా బదులిచ్చారు. మరోవైపు దివ్యాంగుల కోసం దశాబ్ద కాలంగా పని చేస్తున్న అశోక్‌ గిరి దంపతులను మంత్రి అభినందించారు. ఈ సంస్థ విస్తరణకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

దివ్యాంగులందరికీ యూడీఐడీ కార్డులు
ఇతర రాష్ట్రాల్లోనూ చెల్లుబాటయ్యేలా కేంద్రం ఏర్పాట్లు
దేశవ్యాప్తంగా దివ్యాం గులందరికీ ఒకే విధమైన గుర్తింపు ఉండేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు మంజూరు చేసే వైకల్య ధ్రువపత్రాలు ఇతర రాష్ట్రాల్లో చెల్లుబాటు కాకపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ దివ్యాంగులకు యునీక్‌ డిసెబిలిటీ ఐడెంటిఫికేషన్‌ (యూడీ ఐడీ) కార్డులను అందించే అంశంపై కేంద్ర సామాజిక న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది.

కేంద్రం అందించే యూడీఐడీ కార్డుల ద్వారా దివ్యాంగ అభ్యర్థులు ఏ రాష్ట్రం లోనైనా విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వే షన్‌ పొందే వీలు కలుగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారు లు చెబుతున్నారు. కేంద్రం సూచన మేరకు రాష్ట్రంలో దివ్యాంగుల వివరాలను సామాజిక న్యాయ శాఖకు అందించనున్నట్లు పేర్కొన్నారు. యూడీఐడీ కార్డుల జారీకి సంబంధించి వికలాంగులకు అవగాహన కల్పించడంతో పాటు కేంద్రం అమలు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ప్రక్రియపై శిక్షకులకు అవగాహన కల్పించేం దుకు మహిళా, శిశు, వికలాంగుల, గ్రామీణా భివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

యూడీఐడీతో ఎంతో మేలు
యూడీఐడీ కార్డుల జారీ ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు దివ్యాంగులకు అందిస్తున్న ప్రయోజ నాలను వారందరూ పొందేందుకు వీలు కలుగుతుంది. ఆధార్‌ నంబర్‌తో ఒకే విధమైన గుర్తింపునిస్తే  అన్ని రాష్ట్రాల్లో దివ్యాంగులకు మేలు జరుగుతుంది.
–కె.నాగేశ్వర్‌రావు, జాతీయ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement