జ్ఞానసాయికి ఉచితంగా చికిత్స | Sakshi
Sakshi News home page

జ్ఞానసాయికి ఉచితంగా చికిత్స

Published Sat, Jun 25 2016 2:10 AM

జ్ఞానసాయికి ఉచితంగా చికిత్స - Sakshi

- కాలేయ మార్పిడికి ముందుకొచ్చిన గ్లోబల్ ఆస్పత్రి
- ప్రభుత్వమే ఖర్చును భరిస్తుందన్న సీఎం

 సాక్షి, హైదరాబాద్/అమరావతి: పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయికి చికిత్స చేసేందుకు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చారు. పైసా ఖర్చు లేకుండానే కాలేయ మార్పిడి చేయనున్నట్లు ప్రకటించారు. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల ఎనిమిది నెలల చిన్నారి జ్ఞానసాయి పుట్టుకతోనే అరుదైన కాలేయ సంబంధ వ్యాధి(బిలియరి అట్రీషియా)తో బాధపడుతోంది. దీనిపై ‘సాక్షి’ రాసిన కథనానికిగ్లోబల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ రవీంద్రనాథ్‌సహా ప్రముఖ కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ మహ్మద్‌రేలా స్పందించారు. పైసా ఖర్చులేకుండా చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయనున్నట్లు ప్రకటించారు.  శుక్రవారం హైదరాబాద్ గోబల్ ఆస్పత్రిలో పాప ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

 వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం : ఇదిలా ఉండగా జ్ఞానసాయి వైద్యానికయ్యే ఖర్చులన్నింటినీ భరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. జ్ఞానసాయిపై వచ్చిన కథనాన్ని ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందిస్తూ..చికిత్స అందించడానికి అవసరమైన నగదును సీఎం సహాయనిధి నుంచి మంజూరుచేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్లోబల్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

 ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన జ్ఞానసాయి తల్లిదండ్రులు
 తంబళ్లపల్లె:  చిన్నారి జ్ఞానసాయికి ‘సాక్షి’ చేయూతనిచ్చింది. ఆమె దీనస్థితి గురించి,  సాక్షి పలు వార్తా కథనాలు రాసింది.  దీనికి గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం, సీఎం స్పందించడంలో పాటు  స్పందించిన దాతలు విరాళాలను చెక్కుల రూపంలో రూ.16 వేలు, రూ.పదివేలు చొప్పున ఆర్థిక సాయాన్ని జ్ఞానసాయి తండ్రి రమణప్పకు అందజేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement