టీఆర్‌ఎస్ ప్లీనరీకి తొలగిన అడ్డంకులు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్లీనరీకి తొలగిన అడ్డంకులు

Published Sat, Apr 23 2016 3:20 AM

టీఆర్‌ఎస్ ప్లీనరీకి తొలగిన అడ్డంకులు

♦ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్
♦ ఈనెల 27న ఖమ్మంలో ప్లీనరీ, బహిరంగ సభ
 
 సాక్షి, హైదరాబాద్:
పాలేరు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో ఖమ్మంలో ఈ నెల 27న జరపతలపెట్టిన టీఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధానికి తెరపడింది. ప్లీనరీ నిర్వహించుకోవడానికి టీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతి ఇస్తూ, కొన్ని షరతులు విధించింది. ఈ సారి 15వ ప్లీనరీని ఖమ్మంలో జరపాలని టీఆర్‌ఎస్ నెల రోజుల కిందటే  నిర్ణయించింది.  కాగా, ఇదే జిల్లా పరిధిలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారు కావడంతో ఎన్నికల నిబంధనలు అనుమతించవన్న అభిప్రాయం వ్యక్తమయింది.

ఈ నేపథ్యంలో పార్టీ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర సీఈసీకి లేఖ రాశారు. ముందుగానే తమ కార్యక్రమాలను ఖరారు చేశామని, ఇప్పటికిప్పుడు ఇతర ప్రాంతానికి ప్లీనరీ వేదికను తరలించడం కష్టమైనందున నిర్వహణకు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా సీఈసీ భన్వర్‌లాల్‌ను కలసి ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని కోరింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్‌కు ఈసీ నుంచి లేఖ అందింది. ‘ఈనెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. అయితే, ఈ ఖర్చును పార్టీ ఖాతాలో చూపించాలి. ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోవద్దు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారిక పర్యటనలు జరపొద్దు’ అని షరతులు విధించింది. కాగా, ప్లీనరీ, బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. శుక్రవారం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మంత్రులు జన సమీకరణపై సమీక్షలు నిర్వహించారు.  

 సీఎంతో ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ
 ప్లీనరీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు తుది రూపునిచ్చారు. ప్లీనరీ తీర్మానాల కమిటీ కన్వీనర్, ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌తో భేటీ అయ్యింది. ప్లీనరీలో రాజకీయ తీర్మానాలు కాకుండా ప్రభుత్వ పథకాలు, విధానాలకు సంబంధించి 14 లేదా 15 తీర్మానాలు ఉంటాయని సమాచారం.

Advertisement
Advertisement