సంక్షేమ పథం.. ప్రగతి రథం | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథం.. ప్రగతి రథం

Published Sat, Apr 22 2017 1:30 AM

సంక్షేమ పథం.. ప్రగతి రథం - Sakshi

- బంగారు తెలంగాణే మా ధ్యేయం
- ప్లీనరీ వేదికగా టీఆర్‌ఎస్‌ ఏడు తీర్మానాలు
- ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరణ


సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీ సందర్భంగా పార్టీ సాధించిన విజయాలు.. చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, బంగారు తెలంగాణ సాధనకు తీసుకుంటున్న చర్యలపై ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. శుక్రవారం కొంపల్లిలో తెలంగాణ ప్రగతి ప్రాంగణం వేదికగా పార్టీ నేతలు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో ఆమోదించారు. వీటిలో ‘సంక్షేమంలో స్వర్ణయుగం’ తీర్మానాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా.. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బుడాన్‌బేగ్‌ బలపరిచారు. ‘నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో నూతనాధ్యాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం’ తీర్మానాన్ని రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ ఎన్‌.నిరంజన్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ బలపరిచారు.

‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం..వృత్తి పనులకు ప్రోత్సాహం’ తీర్మానాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రవేశపెట్టగా.. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ బలపరిచారు. ‘విద్యుత్‌ రంగంలో విజయం–పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన–ఐటీ రంగ అభివృద్ధి’ తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు బలపరిచారు. ‘వినూత్న విధానాలు– ప్రగతికాముక పథకాలు’ తీర్మానాన్ని ఎంపీ బి.వినోద్‌కుమార్‌ ప్రవేశపెట్టగా.. మరో ఎంపీ బాల్క సుమన్‌ బలపరిచారు. ‘తాగునీటి వ్యథతీర్చే మిషన్‌ భగీరథ’ తీర్మానాన్ని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ బలపరిచారు. ఏడో తీర్మానంగా ‘సామాజిక రుగ్మతలపై సమరం’ను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత బలపరిచారు.

1.సంక్షేమంలో స్వర్ణయుగం
రాష్ట్రంలో 90 శాతం ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సంక్షేమ రంగానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా రూ.35 వేల కోట్లు కేటాయిస్తోంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా 35.87 లక్షల మందికి ఆసరా పింఛన్ల కోసం ఏటా ప్రభుత్వం రూ.5,330 కోట్లు ఖర్చు చేస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు 26 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందజేస్తోంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు నేరుగా అందజేస్తోంది.

ఎస్సీల సంక్షేమానికి రూ.14,375 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,156 కోట్లు కేటాయించింది. మానవీయతే అభిమతంగా రాజీలేని కార్యాచరణ రూపొందించింది. బీసీ సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5,070 కోట్లు కేటాయించింది. ఎంబీసీల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. మైనార్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 470 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు కేటాయించి వారిని ఆదుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 20 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటుంది.

విద్యుత్‌ శాఖలో 24 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. సైనికులు, సింగరేణి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 2.6 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. 1,426 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. విద్యార్థులకు మెస్‌చార్జీల పెంపుతో 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. విద్యార్థులకు సన్నబియ్యం అన్నంతో ఆకలి తీర్చిన ఘనత మా ప్రభుత్వానిదే. 2.80 కోట్ల మందికి రేషన్‌ బియ్యానికి బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు కేటాయించింది. కార్మికులకు జీవిత బీమా, బీడీ కార్మికుల సంక్షేమం, ఒంటరి మహిళల సంక్షేమం, వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను రద్దు, కళాకారుల సంక్షేమం, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి–కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్, అంగన్‌వాడీల సంక్షేమం, షీటీమ్స్, జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, పేదల మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు పరమపద వాహనాల ఏర్పాటు వంటి అంశాలను ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

2.సాగు, నీటిపారుదల రంగాల్లో నూతనాధ్యాయం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువుల్లో ప్రభుత్వం గత రెండేళ్లలో 19,500 చెరువులను బాగు చేసింది. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఏడు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌ చేపట్టింది. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు మొదటిసారి నీళ్లందించాం. ఇప్పటివరకు రూ.35,200 కోట్లు ఖర్చుతో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 11 నెలల రికార్డు కాలంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. పాలమూరు– రంగారెడ్డి, డిండి, ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, మిడ్‌మానేరు, మిషన్‌ కాకతీయ పనుల పూర్తికి బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశాం.

3.గ్రామీణ ఆర్థికం పరిపుష్టం..వృత్తులకు ప్రోత్సాహం
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.5 వేల కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకుల సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించారు. విశ్వకర్మలు, కుమ్మరి, గౌడ వృత్తుల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. నేత కార్మికులను ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించింది. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్, సిరిసిల్లలో అపరెల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించింది.

4.విద్యుత్‌లో విజయం.. ఐటీలో అభివృద్ధి
విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక చేపట్టి విజయం సాధించింది. రాష్ట్రం ఆవిర్భాం సమయంలో స్థాపిత విద్యుత్‌ సామ ర్థ్యం 6,574 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 11,689 మెగావాట్ల సామర్థ్యం. 2019 నాటికి 27,187 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యుత్‌ లోటు ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా మార్చింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 2,929 పరిశ్రమలకు అనుమతులు మంజూరుతో రూ.49,463 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో ప్రత్యక్షంగా 1.95 లక్షలు, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి లభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేందుకు టీఎస్‌ప్రైడ్, టీఎస్‌ప్రైమ్‌ ఏర్పాటు చేసింది. ఆపిల్‌ నుంచి అమెజాన్‌ వరకు దిగ్గజ ఐటీ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారింది. ఈ రంగంలో ఏటా రూ.75,070 కోట్ల పెట్టుబడులతో 4.07 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది.

5.వినూత్న విధానాలు– ప్రగతికాముక పథకాలు
పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రభుత్వం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్‌ పరిధిలో రెండు, మూడు లక్షల కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీల కోసం 134, ఎస్టీలకు 54, బీసీలకు 124, మైనార్టీలకు 201 రెసిడెన్షియల్‌ స్కూళ్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ స్కూళ్ల సంఖ్య 804కు చేరుకుంది.రాష్ట్రంలో 33 శాతం మేర హరితాన్ని పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తోంది. పోలీస్‌ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్‌ పరిధిలో రూ.2247 కోట్ల వ్యయంతో 14,689 కి.మీ మేర బీటీ రహదారులకు మరమ్మతులు చేశాము. రాష్ట్రంలో 2,776 కిలోమీటర్ల నిడివిగల 19 జాతీయ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సాధించింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది.

6.తాగునీటి వ్యథ తీర్చే మిషన్‌ భగీరథ
ఈ పథకానికి ప్రభుత్వం రూ.43 వేల కోట్లు వెచ్చించనుంది. 2017 డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలోని 24,248 గ్రామీణ ఆవాసాలు, 65 పట్టణ ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మిషన్‌ భగీరథ కోసం కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 19 ఇన్‌టేక్‌ వెల్స్‌ నిర్మాణాలు, 50 నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 596 ఓహెచ్‌బీఆర్, 547 జీఎల్‌బీఆర్, 18,500 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు 1,69,700 కి.మీ. మార్గంలో పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకంలో ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో తెలంగాణ ఆడపడచుల కన్నీటి కష్టాలు దూరం కానున్నాయి.

7. సామాజిక రుగ్మతలపై పోరు..
గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, ఈవ్‌ టీజింగ్‌ను అరికట్టేందుకు షీటీమ్స్, ఆహార పదార్థాల కల్తీ నివారణ, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, అనవసర ఆపరేషన్లకు అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలను ఇందులో వివరించారు.

Advertisement
Advertisement