కుటుంబ వ్యవస్థను బలపరిచేలా సినిమాలు | Sakshi
Sakshi News home page

కుటుంబ వ్యవస్థను బలపరిచేలా సినిమాలు

Published Thu, Sep 22 2016 2:47 AM

కుటుంబ వ్యవస్థను బలపరిచేలా సినిమాలు - Sakshi

- కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆకాంక్ష
- టీఎస్సార్‌కు డాక్టర్ అక్కినేని లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం
 
 సాక్షి, హైదరాబాద్: కళలు, సాహిత్యం సామాజిక సామరస్యతను కాపాడతాయని  కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. గతంలో సామాజిక అవగాహన కల్పించేవిధంగా హరికథలు, నాటకాలు ఉండేవని, ఇప్పుడు అందుకు భిన్నంగా దిగజారిన సినిమా పోకడలను చూడాల్సి వస్తోందని అన్నారు. సినిమాలు కుటుంబ వ్యవస్థను బలపరిచేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం ఇక్కడ రవీంద్రభారతిలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి రసమయి- డాక్టర్ అక్కినేని లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి సత్కారం ప్రతిభకు పురస్కారమని, ఇది భారతీయ సంస్కారమని అన్నారు. ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి మహానటులు మళ్లీ రారేమోననీ, మనం మళ్లీ వారిని చూడబోమని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కినేని భారతదేశం గర్వించదగ్గ నటుడని పేర్కొన్నారు. టీఎస్సార్ కళల పరిరక్షకుడే కాదు పార్లమెంట్‌లో కూడా చక్కగా మాట్లాడతారంటూ సెటైర్లు వేసి సభలో నవ్వులు పూయించారు. తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావుకి సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించేవారన్నారు.

ఎంతో మంది కళాకారులను ఆదరించి, కళాసంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న టీఎస్సార్‌కి అక్కినేని పురస్కారం అందించటం సముచితమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ సలహాదారు డాక్టర్ జయప్రద, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ నటి జమున, అక్కినేని కుమార్తె నాగసుశీల, రసమయి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె.రాము తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎం.కె.రాము రచించిన మహానటుడు అక్కినేని సంగీత నృత్యరూపకం సభికులను అలరించింది. సుశిక్షితులైన 36 మంది శాస్త్రీయ కూచిపూడి, కథక్, జానపద కళాకారులు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. డాక్టర్ అక్కినేని విభిన్న పాత్రలపై తాడేపల్లిగూడెం చిత్రకారుడు ఎస్‌వీఆర్ చిన్న బాల్‌పెన్నుతో వేసిన రేఖాచిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది.

Advertisement
Advertisement