Sakshi News home page

కేంద్ర మంత్రుల ఒత్తిడి లేదు!

Published Sat, Feb 20 2016 2:58 AM

కేంద్ర మంత్రుల ఒత్తిడి లేదు!

‘హెచ్‌సీయూ’ వివాదంపై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక
విద్యార్థుల సస్పెన్షన్ నుంచి ఆత్మహత్యదాకా బాధ్యత వర్సిటీ అధికారులదే

 
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్‌కు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు, వర్సిటీలో వివాదాలకు యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్, స్టూడెంట్స్ వె ల్ఫేర్ డీన్ ప్రకాష్‌బాబు,  తదితరులతో మాట్లాడిన మీదట... మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని అభిప్రాయపడుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. అందువల్ల హెచ్‌సీయూ అధికారులపై మంత్రుల ఒత్తిడి లేదని భావిస్తున్నట్టు పేర్కొంది.

 హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య అంశం దుమారం రేపడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్‌ఆర్డీ) షకీలా శంషు, సూరత్‌సింగ్‌లతో ద్విసభ్య నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వర్సిటీలో పరిస్థితులను పరిశీలించింది. అధికారులు, విద్యార్థులతో మాట్లాడి... హెచ్‌ఆర్డీకి తన నివేదికను అందజేసింది. హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్, వివాదాలు, రోహిత్ ఆత్మహత్య తదితర ఘటనలకు వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రోహిత్‌తో పాటు ప్రశాంత్, విజయ్, సుంకన్న, శేషులపై సస్పెన్షన్ వేటుకు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వర్సిటీ యాజమాన్యం చర్చలు జరపకపోవడాన్ని కమిటీ తప్పు పట్టింది. వర్సిటీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టులోనూ, 2015 ఆగస్టు 3, 4 తేదీల్లో వర్సిటీ ప్రాక్టోరియల్ బోర్డు చేపట్టిన విచార ణలోనూ  తప్పులు దొర్లినట్లు విశ్లేషించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు గానీ, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థగానీ వర్సిటీలో లేని కారణంగా... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు తాము వివక్షకు గురవుతున్నట్లు భావిస్తున్నారని పేర్కొంది.

 కమిటీల సూచనలు అమలు చేయలేదు..
 హెచ్‌సీయూలో జరుగుతున్న కొన్ని విషయాల్లో త్వరగా స్పందించి, చర్యలు తీసుకోవాలంటూ 2014 న వంబర్‌లో పార్లమెంటు సభ్యులు లేఖ రాసిన విషయాన్ని కూడా నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. వర్సిటీలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో 2008లో నియమించిన వినోద్ పావురాల కమిటీ సూచనలనుగానీ, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ సూచనలనుగానీ, 2014లో నియమించిన జస్టిస్ రామస్వామి కమిటీ నివేదికనుగానీ వర్సిటీ యాజ మాన్యం లక్ష్యపెట్టలేదని, ఎక్కడా వాటిని అమలు చేయలేదని కమిటీ స్పష్టం చేసింది. దీంతోపాటు వివిధ అంశాలపై వర్సిటీలో నిర్దిష్టమైన విధివిధానాలు లేవని... దాంతో అప్పటికప్పుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల్లో అపోహలకు, అనుమానాలకు తావిచ్చాయని తెలిపింది. అయితే కోర్సులు పూర్తిచేసుకున్న చాలా మంది విద్యార్థులు ఇంకా హాస్టళ్లలోనే ఉండడం వర్సిటీలో అనేక సమస్యలకు కారణమవుతోందని కమిటీ పేర్కొంది.

Advertisement

What’s your opinion

Advertisement