పగటి వేషగాడిలా చంద్రబాబు :వాసిరెడ్డి పద్మ | Sakshi
Sakshi News home page

పగటి వేషగాడిలా చంద్రబాబు :వాసిరెడ్డి పద్మ

Published Fri, Feb 28 2014 1:42 AM

పగటి వేషగాడిలా చంద్రబాబు :వాసిరెడ్డి పద్మ - Sakshi

 సాక్షి, హైదరాబాద్: ప్రజాగర్జన పేరుతో విజయనగరంలో నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన తీరు పగటి వేషగాడి మాదిరిగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీమాంధ్రను సింగపూర్‌లాగా అభివృద్ధి చేస్తానని, సీమాంధ్రకు రాజధానిని తానే నిర్మిస్తానని ప్రగల్భాలు చెబుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లపాటు ఉన్నపుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
 
 చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి నగరం వెలుపల స్థలమిచ్చినా, దానికి దారి చూపించలేకపోయారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాతనే విమానాశ్రయానికి దారులు వేస్తూ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగురోడ్డు వంటి వాటిని నిర్మించారని గుర్తుచేశారు. ఇంకా ఏమన్నారంటే...
 
  మీ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి పనికి వచ్చే ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా ఎందుకు కట్టలేకపోయారు? కృష్ణా డెల్టా ఆయకట్టుకు రెండో పంటకు కాదు కదా, ఒక్క పంటకు కూడా నీరు ఎందుకు ఇవ్వలేక పోయారు?
 
  పట్టుమని పది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేయగలరా? ఆరునెలల నుంచి నిద్రపోవడంలేదని చెబుతున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఆరేళ్ల కిందట ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోలేదెందుకు?
 
  రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబుకు అసలు ఇపుడు విభజన అన్యాయమని మాట్లాడే అర్హత ఉందా?
  విభజన బిల్లు చాలా బాగుందని మొదటి ఓటు తామే వేశామని, అందుకు తమకు గర్వంగా ఉందని టీడీపీ ఎంపీ చెప్పలేదా? బిల్లు పెట్టిన కాంగ్రెస్, బిల్లు బాగుందన్న టీఆర్‌ఎస్, టీడీపీకి ఉన్న తేడా ఏమిటి?
 

Advertisement
Advertisement