హెచ్ సీయూలో వీసీ ఘెరావ్ | Sakshi
Sakshi News home page

హెచ్ సీయూలో వీసీ ఘెరావ్

Published Thu, Jan 28 2016 3:52 AM

హెచ్ సీయూలో వీసీ ఘెరావ్

ముందస్తు సమాచారం లేకుండా దీక్షాస్థలికి వచ్చిన ఇన్‌చార్జి వీసీ
ఆగ్రహించిన విద్యార్థులు.. గోబ్యాక్ అంటూ నినాదాలు

సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన శ్రీవాస్తవ ముందస్తు సమాచారం లేకుండా దీక్షా స్థలికి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి జేఏసీ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటుండగా శ్రీవాస్తవ దీక్షాస్థలానికి వచ్చారు. ఇది తెలుసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులు దీక్షాస్థలానికి చేరుకున్నారు. వీసీ గోబ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇన్‌చార్జి వీసీ తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేవరకూ ఎవరి తోనూ మాట్లాడబోమన్నారు. దీంతో శ్రీవాస్తవ వెనుదిరిగారు. విద్యార్థుల డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించగా... అందుకే ఇక్కడికి వచ్చానని, విద్యార్థులు అనుమతించలేదని ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్లిపోయారు.

 ఇన్‌చార్జి వీసీ తప్పుకోవాల్సిందే..
తమ డిమాండ్లను నెరవేర్చకుండా, విద్యార్థులను మరింత రెచ్చగొట్టి ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నంలో భాగంగానే శ్రీవాస్తవ దీక్షాస్థలానికి వచ్చారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఇద్దరి ఆత్మహత్యలకు కారకుడైన విపిన్ శ్రీవాస్తవ ఎవరూ లేని సమయం చూసుకుని దీక్షాస్థలానికి రావడంలో అర్థమేమిటని విద్యార్థి నాయకురాలు అర్పిత ప్రశ్నించారు. దొంగతనంగా వచ్చి వెళ్లారని మండిపడ్డారు. ఆయనకు దైర్యం ఉంటే తప్పులను ఒప్పుకుని పదవి నుంచి వైదొలగాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

వర్సిటీల బంద్ విజయవంతం
రోహిత్ ఆత్మహత్య అంశంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి జేఏసీ నేతలు ఇచ్చిన యూనివర్సిటీల బంద్ పిలుపు విజయవంతమైంది. ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, కేరళలోని కాలికట్ యూనివర్సిటీ, చెన్నై వర్సిటీ, ముంబై వర్సిటీ, రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, ఉర్దూ, మహాత్మాగాంధీ, హెచ్‌సీయూ, జేఎన్టీయూ విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారని.. అఖిల భారత స్థాయిలో బంద్ విజయవంతం అయిందని విద్యార్థి నాయకులు అర్పిత, వెంకటేశ్ చౌహాన్ తెలిపారు.

అఖిల భారత విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. హెచ్‌సీయూలో బుధవారం సమావేశమైన విద్యార్థి జేఏసీ నేతలు... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. దీంతోపాటు రోహిత్ తల్లితో కలసి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని తీర్మానించారు.

ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రిలే దీక్షలు..
సెలవుపై వెళ్లిన హెచ్‌సీయూ వీసీ అప్పారావును డిస్మిస్ చేయాలని, ఇన్‌చార్జి వీసీ శ్రీవాస్తవ తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు హెచ్‌సీయూ అధ్యాపక బృందం ప్రకటించిం ది. గతంలో సెంథిల్ కుమార్, నేడు రోహిత్ ఆత్మహత్య కు కారణమైన శ్రీవాస్తవ వీసీగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా తాము దీక్షకు ఉపక్రమించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదవికి రాజీనామా చేసిన ప్రొఫెసర్ కృష్ణ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఏబీవీపీ సెమినార్లు
రోహిత్ ఆత్మహత్య ఘటనపై గురువారం నుంచి దేశవ్యాప్తంగా సెమినార్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏబీవీపీ ప్రకటించిం ది. కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని... ఆ ఘటనకు సంబంధించి జరిగినదేమిటో, వాస్తవాలేమిటో వివరిస్తామని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్ బిద్రే తెలిపారు.

 మరో ఏడుగురు ఆమరణ దీక్ష
గురువారం నుంచి మరో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్ష చేయనున్నట్లు విద్యార్థి నాయకులు ప్రకటించారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల్లో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం వారిని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వారితోపాటు గత నాలుగు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న పీహెచ్‌డీ విద్యార్థి దేవీప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇక విద్యార్థులకు మద్దతుగా తమిళనాడుకి చెందిన ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ మీనా కందస్వామి బుధవారం ఒక రోజు దీక్ష చేపట్టారు. హెచ్‌సీయూ కేంద్రంగా ఎగిసిపడిన ఉద్యమం వివక్షకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త ఉద్యమానికి దోహదపడనుందని ఆమె తెలిపారు. వివక్షకు గురవుతున్నది కేవలం విద్యార్థులే కాదని, దళిత ప్రొఫెసర్లు సైతం వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement