వీధి వ్యాపారులకు వెండింగ్‌ సర్టిఫికెట్లు | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారులకు వెండింగ్‌ సర్టిఫికెట్లు

Published Sun, Feb 18 2018 2:25 AM

vending certificates to Street vendors  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీధి వ్యాపారుల చట్టం (స్ట్రీట్‌ వెండర్స్‌ యాక్ట్‌) ప్రకారం వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా వారికి త్వరలో ‘వెండింగ్‌ సర్టిఫికెట్లు’జారీ చేయనున్నామని హైకోర్టుకు రాష్ట్రæ ప్రభుత్వం తెలిపింది. ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకోవాలో నిర్దేశిస్తూ వెండింగ్‌ జోన్లను కూడా నిర్ణయించనున్నామని వివరించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 67,313 మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించామని, ఇప్పటికే 63,372 మందికి గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపింది.

హైదరాబాద్‌లో కొన్ని సర్కిళ్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం ఏర్పాటు చేయాల్సిన టౌన్‌ వెండిం గ్‌ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించింది. కేంద్రం తీసుకొచ్చిన వీధి వ్యాపారుల చట్టానికనుగుణంగా రాష్ట్రం రూపొందించి న స్ట్రీట్‌ వెండింగ్‌ స్కీమ్‌ను అమలు చేయడం లేదంటూ జి.గణేశ్‌సింగ్‌ అనే వ్యాపారి గతేడాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా లని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు పురపాలకశాఖ సంయుక్త కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కౌంటర్‌ దాఖలు చేశారు. వీధి వ్యాపారుల చట్టాన్ని అమలు చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ స్ట్రీట్‌ వెండింగ్‌ స్కీం ప్రకారం సర్వే నిర్వహించామని, వెండింగ్‌ సర్టిఫికెట్లను డిజైన్‌ చేశామని, త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 30 సర్కిళ్లున్న నేపథ్యంలో ఇక్కడ ఇంకా వెండింగ్‌ కమిటీలను వేయలేదని వివరించారు.

గతంలో 18 సర్కిళ్లుండేవని, వీటికి కమిటీలు వేశామని, కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో సర్వే పూర్తయిన తరువాత స్ట్రీట్‌ వెండింగ్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తామన్నారు.  దీంతో ధర్మాసనం వీధి వ్యాపారులపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ జతచేయాలని, ప్రభుత్వం వెండింగ్‌ జోన్లను నిర్ణయించిన తరువాత వాటిపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement