ఎన్‌కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదు | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదు

Published Sun, Apr 12 2015 4:35 AM

ఎన్‌కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదు - Sakshi

అది రాష్ట్రాల అంశం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, అవి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్‌కౌంటర్ల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. వాటిపై కేంద్రం జోక్యం చేసుకోదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ రాష్ర్ట ప్రభుత్వంపైనే ఉంది. ఎన్‌కౌంటర్ వల్ల తమిళనాడు, ఏపీల మధ్య ఏర్పడిన వివాదం ఏక్కడికి వెళుతుందో చూద్దాం. సిమి ఉగ్రవాదులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా పనిచేసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎన్‌కౌంటర్ జరిగితే కొంత మంది తీవ్రంగా స్పందిస్తున్నారు.

సామాన్య ప్రజలు, పోలీసులు అలాంటి సంఘటనల్లో మరణిస్తే వీరు కనీసం మాట కూడా మాట్లాడరు. గతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపితే మజ్లిస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదు. పోలీసులు మనుషులు కాదా?. ఎన్‌కౌంటర్లపై విచారణ జరపాలని కోరడంలో తప్పులేదు. కానీ అసహాయులు చనిపోయినప్పుడు మౌనం వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల అతిగా స్పందించడం సరికాదు.
 
‘బోస్’ నిఘా వార్తలపై కాంగ్రెస్‌కు ఉలుకెందుకు?

జాతి నేత సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై గతంలో 20 ఏళ్లపాటు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కథనాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను దేశ ప్రజల ముందుంచాలి. ఈ విషయాలు బయటకు పొక్కగానే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోంది?. ఇళ్లు కొనేవారు, అమ్మేవారిద్దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రియల్‌ఎస్టేట్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులైజేషన్ చట్టం ఆమోదం కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టబోతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement