రోజాను అడ్డుకోవడం సరికాదు: వీహెచ్‌

12 Feb, 2017 02:09 IST|Sakshi
రోజాను అడ్డుకోవడం సరికాదు: వీహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: అమరావతిలో జరుగుతున్న మహిళా సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్న ఏపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం సరికాదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మహిళా సాధికారత పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు.

కేవలం ప్రచారం, ఓట్ల కోసమే చంద్రబాబు ఇలాంటి సదస్సు నిర్వహించుకుంటున్నారన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్న ఎంపీ కవిత, రాష్ట్రంలో తన తండ్రి కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు స్థానమెందుకు లేదో చెప్పాలన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పక్క రాష్ట్రంలోని కేబినెట్‌లో మహిళలు లేరనే విషయం తెలియదా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు