ఔటర్ పై కారు ప్రమాదం విజయసాయిరెడ్డికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఔటర్ పై కారు ప్రమాదం విజయసాయిరెడ్డికి గాయాలు

Published Wed, May 11 2016 2:30 AM

ఔటర్ పై కారు ప్రమాదం విజయసాయిరెడ్డికి గాయాలు - Sakshi

ఘటనలో దుర్గాప్రసాదరాజు తలకూ గాయాలు
‘అపోలో’లో చికిత్స.. జగన్‌సహా పలువురు నేతల పరామర్శ

  సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డుపై మంగళవారం జరిగిన ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఎస్.దుర్గాప్రసాదరాజు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. త్రుటిలో ప్రమాదం నుంచి ఇద్దరు నేతలూ క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం వీరు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిరెడ్డి ఎడమ మోకాలికి గాయమైంది. దుర్గాప్రసాదరాజు తలకు ఎడమవైపు గాయాలయ్యాయి.

కాకినాడలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్న ప్రత్యేక హోదా సాధన ధర్నాలో పాల్గొనడంకోసం వీరు కారులో మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. అక్కడినుంచి తొలి విమానంలో వీరు రాజమండ్రికి వెళ్లాల్సి ఉంది. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో వెనుకసీట్లో కూర్చున్న ఇరువురు నేతలకు గాయాలయ్యాయి. కారు ముందు సీట్లో కూర్చున్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.దశరథరెడ్డి, డ్రైవర్ సంతోష్‌లకు స్వల్పగాయాలయ్యాయి. హుటాహుటిన అందర్నీ అపోలో ఆసుపత్రికి తరలించగా అత్యవసర చికిత్స చేశారు. సాయిరెడ్డిని కనీసం 3 నుంచి 4 వారాలపాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దుర్గాప్రసాద్‌రాజుకు తలకు గాయమైందని, ఆయన క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

 వైఎస్ జగన్ పరామర్శ..
ప్రమాదవార్త తెలియడంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వెంటనే ఫోన్‌లో విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాదరాజులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికొచ్చి విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాదరాజులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement