అరెస్టుకు ముందే స్వచ్ఛంద వాంగ్మూలం | Sakshi
Sakshi News home page

అరెస్టుకు ముందే స్వచ్ఛంద వాంగ్మూలం

Published Fri, Jan 31 2014 4:55 AM

అరెస్టుకు ముందే స్వచ్ఛంద వాంగ్మూలం - Sakshi

  •     పోలీసు శునకాలకు చిక్కకుండా కారంపొడి
  •      సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా మాస్క్
  •      పాదముద్రలు పడకుండా గోనె సంచులు
  •      వేలిముద్రలు లేకుండా ఉండేందుకు గ్లౌజ్‌లు
  •      కంటి పాపలు సైతం కనిపించకుండా కళ్లజోడు
  •      తల వెంట్రుకలు రాలకుండా ప్రత్యేక జెల్
  •  సాక్షి, సిటీబ్యూరో: ఘరానా నేరగాళ్లను సైతం తలదన్నేలా సినీ ఫక్కీలో ఇంత పగడ్భందీగా తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో రూ.5.97 కోట్ల విలువైన సొత్తును కొల్లగొట్టిన కిరణ్, ఆనంద్‌లు పోలీసులకు నేరానంతరం మాత్రం ఓ బలమైన ఆధారాన్ని అందించారు. అదే స్వచ్ఛంద నేరాంగీకార వాంగ్మూలం. దీనికి సంబంధించి వారు మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలను సేకరిస్తున్న పోలీసులు వాటిని న్యాయస్థానంలో సమర్పించాలని నిర్ణయించారు. ఈ రికార్డులే కనుక లేకుంటే నిందితుల్ని దోషులుగా నిరూపించడం కష్టసాధ్యమయ్యేదని పోలీసులంటున్నారు.
     
    అది న్యాయస్థానంలో చెల్లదు...
     
    సాధారణంగా వివిధ నేరాల్లో నిందితుల్ని అరెస్టు చేశాక పోలీసులు వారి నుంచి నేరాంగీకార వాంగ్మూలం సేకరిస్తారు. పంచ్ విట్నెస్‌లుగా పరిగణించే సాక్షుల సమక్షంలో దీన్ని పత్రాలపై రికార్డు చేస్తారు. నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరిచేప్పుడు దీన్ని కూడా న్యాయస్థానానికి అందిస్తారు. ఈ వాంగ్మూలంపై పంచ్ లతో పాటు కొన్ని సందర్భాల్లో నిందితుల సంతకం కూడా ఉంటుంది. అయితే ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల మినహా మిగిలిన వాటిలో ఈ వాంగ్మూలం విచారణలో చెల్లదు. నిందితుడు పోలీసుల ముందు ఇచ్చినది కావడంతో బెదిరింపులు, బలవంతపు కోణం ఉండచ్చనే భావనతో కోర్టు పరిగణలోకి తీసుకోదు.
     
    ఇది తిరుగులేని సాక్ష్యం...
     
    ‘తనిష్క్ దొంగలు’ కిరణ్‌కుమార్, ఆనంద్‌ల విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. పక్కా స్కెచ్‌లో భారీ చోరీ చేసినప్పటికీ... అమ్మే విషయంలో తలెత్తిన సమస్యలతో బెంబేలెత్తారు. దీంతో ఒకరు ఆదివారం, మరొకరు బుధవారం వేర్వేరు మీడియా ఛానళ్ల వద్దకు వెళ్లి వారంతట వారే ‘లొంగిపోయారు’.  పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందే నిందితులిద్దరూ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తామే నేరం చేశామని అంగీకరించారు. ఇది మొత్తం రికార్డు కావడంతో పాటు మాధ్యమంలో ప్రసారం కూడా అయింది. ఆ తరవాత పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేశారు.
     
    జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆనంద్...
     
    ‘తనిష్క్’ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద్‌ను బుధవారం అరెస్టు చేసిన పశ్చిమ మండ ల పోలీసులు గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం అరెస్టయిన కిరణ్, బుధవారం కటకటాల్లోకి చేరిన ఆనంద్ చెప్పిన అంశాల్లో కొన్ని తేడాలు ఉండటంతో ఇద్దరినీ కలిపి విచారిం చేందుకు నిర్ణయించిన పోలీసులు ఆ మేరకు కస్టడీకి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ విచారణలోనే ఇంకా మిగి లిన రెండు ఉంగరాలు, గాజుల్ని రికవరీ చేయడంతో పాటు నేరం చేయడానికి వినియోగించిన స్క్రూడ్రైవర్, స్పానర్‌లతో పాటు మాస్క్ లు, గ్లౌజ్‌లు స్వాధీనం చేసుకోవాలని అధికారు లు నిర్ణయించారు. ఇదిలా ఉండగా... తనిష్క్ షోరూంకు పోలీసులు గురువారం నో టీసులు జారీచేశారు. చోరీ అయిన మొత్తంపై తొలుత తప్పుడు ఫిర్యాదు ఇవ్వడం,  షోరూం ముందుభాగంలో సీసీ కెమెరాలు అ మర్చకపోవడం, దుకాణం మూసేప్పుడు నగలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చకపోవడం వంటి కారణాలపై జనరల్ మేనేజర్ మణికందన్‌కు ఇవి అందించారు. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యంపై త్వరలోనే ఎస్‌ఐఎస్ సెక్యూరిటీ గ్రూప్ కు కూడా నోటీసులిస్తామని పోలీసులు తెలిపారు.
     
     స్ఫూర్తి, సాక్ష్యం... రెండూ మీడియానే...
     ఈ ఇద్దరు నిందితుల్లో ఎవరికీ గతంలో నేరచరిత్ర లేదు. కిరణ్ ఎప్పుడూ ఠాణా గడప కూడా తొక్కలేదు. ఆనంద్ మాత్రం రెండుమూడుసార్లు తమ స్వస్థలమైన ఈపూరులో పోలీసుల అదుపులోకి వెళ్లాడు. ఆ ఫిర్యాదు లు రాజీ కావడంతో కేసులు నమోదు కా లే దు. అయినప్పటికీ ఈ ఇద్దరూ ఇంత పక్కాగా స్కెచ్ వేసి, రెక్కీ చేసి, చోరీ చేయడానికి క్రైమ్ కథనాలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారమని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. ఏ మీడియా ద్వారా అయితే ఈ ‘తెలివి’ సంపాదిం చారో... అదే మీడియా ద్వారా నేరానికి సం బంధించిన బలమైన సాక్ష్యాన్ని అందించారు.
     

Advertisement
Advertisement