భద్రత గాలికి.. | Sakshi
Sakshi News home page

భద్రత గాలికి..

Published Mon, Mar 13 2017 2:55 AM

భద్రత గాలికి..

వేతనాలు లేక మక్కా, రాయల్‌ మసీదు సిబ్బంది అవస్థలు
సగం మంది హోంగార్డులు
మాతృ విభాగానికి ప్రశ్నార్థకంగా మారిన
మక్కా మసీదు భద్రత


సిటీబ్యూరో: చారిత్రక మక్కా, పబ్టిక్‌ గార్డెన్స్‌లోని రాయల్‌ మసీదు సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. నగరంలో ప్రముఖమైన ఈ రెండు మసీదులు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా మక్కా, రాయల్‌ మసీదుల సిబ్బందికీ గత రెండేళ్లుగా సకాలంలో వేతనాలు అందడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్న అధికారులు తమపై చిన్న చూపు చూడటం దారుమని వారు పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, పిల్లలను చదివించుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు.

మాతృ విభాగానికి హోంగార్డులు
ఇదిలా ఉండగా మక్కా, రాయల్‌ మసీదుల్లో 24 మంది హోం గార్డులు బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం మక్కా మసీదులో 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకుగాను ప్రత్యేకంగా హోంగార్డులను నియమించారు మక్కా, రామల్‌ మసీదులో మొత్తం 24 మంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు.అయితే  గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారిలో 11 మంది మాతృ విభాగానికి వెళ్లి పోయినట్లు మక్కా, రాయల్‌ మసీదు పర్యవేక్షకుడు ఖాద్రీ తెలిపారు. దీంతో మిగిలిన 13 మందితో మక్కా మసీదులో 6–7 మంది చొప్పున బందోబస్తును కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సెక్యూరిటీ ప్రశ్నార్థకం
మక్కా మసీదును సందర్శించడానికి రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. శుక్రవారం, అదివారం, సెలవు దినాల్లో వీరి సంఖ్య భారీగా ఉంటోంది. గతంలో 24 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొంటుండగా, ప్రస్తుతం కేవలం 13 మందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. గతంలో సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మక్కా, రాయల్‌ మసీదు సిబ్బందికి, హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, బందోబస్తును కట్టుదిట్టం చేయాలని పలువురు ధార్మిక, మైనార్టీ స్వచ్చంధ సంస్థలు ప్రతినిధులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement