వేతనాల కోసం ఎదురుచూపులు | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం ఎదురుచూపులు

Published Sat, Feb 13 2016 3:47 AM

వేతనాల కోసం ఎదురుచూపులు - Sakshi

♦ విద్యా వలంటీర్లకు ఐదు నెలలుగా అందని జీతాలు
♦ గౌరవ వేతనమిచ్చే పద్దులో తేడాలున్నాయంటూ ట్రెజరీ కొర్రీ
♦ రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం: పాఠశాల విద్యా డెరైక్టర్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వలంటీర్లకు ఐదు నెలలుగా వేతనాలు కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. విద్యావలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7,974 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, ఆయా పోస్టులను ప్రభుత్వం విద్యా వలంటీర్లతో గత సెప్టెంబర్‌లో భర్తీ చేసిన విషయం విదితమే. వీరికి నెలకు రూ.8 వేల చొప్పున వేతనమిచ్చేలా ఉత్తర్వులు కూడా ఇచ్చింది.

ఈ విద్యా సంవత్సరంలో ఏడు నెలలు మాత్రమే పనిచేసే తమకు గత ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడం పట్ల పలువురు విద్యా వలంటీర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిలాల్లో పూర్తిగానూ, మిగిలిన జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వేతనాలు అందకపోవడంపై విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని వలంటీర్లు ఆరోపిస్తున్నారు. సదరు జిల్లాల్లో బిల్లులు పాస్ చేయకుండా ట్రెజరీ అధికారులు కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు.

మరోవైపు ప్రభుత్వం విద్యావలంటీర్లకు గౌరవ వేతనమిచ్చే పద్దులో కాకుండా వేరే పద్దులో నిధులు విడుదల చేయడం వలన సమస్యలు ఉత్పన్నమయ్యాయని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. తప్పులను సరిచేయడంలో విద్యాశాఖ అధికారులు స్పందించకపోతుండడమే వేతనాల విడుదలలో జాప్యానికి కారణమంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్యా డెరైక్టర్‌ను వివరణ కోరగా, విద్యావలంటీర్లకు వేతనాలు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.

Advertisement
Advertisement