Sakshi News home page

వాటా చెల్లింపులపై వివరణ ఇవ్వండి

Published Wed, Oct 19 2016 4:03 AM

వాటా చెల్లింపులపై వివరణ ఇవ్వండి - Sakshi

తెలంగాణ, ఏపీలకు హైకోర్టు ఆదేశం
సీజీఎఫ్, ఈఏఎఫ్ వాటాల అంశంలో
సౌందరరాజన్ పిల్‌పై స్పందన

సాక్షి, హైదరాబాద్: కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్), ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ (ఈఏఎఫ్)లకు టీటీడీ సహా ఇతర దేవస్థానాలు చెల్లించాల్సిన వాటాలపై చిలుకూరు బాలాజీ దేవస్థానం ధర్మకర్త ఎంవీ సౌందరరాజన్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

2003 నుంచి 2013 వరకు టీటీడీ సహా ఇతర పెద్ద దేవాలయాలు సీజీఎఫ్, ఈఏఎఫ్‌లకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు వాటా చెల్లించాల్సి ఉందని, వీటి వసూలుపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని సౌందరరాజన్ హైకోర్టులో గత నెల 13న పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టు ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. దేవాలయాల్లోని అర్చకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల్లో 27 వేల దేవాలయాలు మూతపడ్డాయన్నారు.

ఈ నేపథ్యంలో 2007లో దేవాదాయ చట్టానికి సవరణలు తెచ్చి, పెద్ద దేవస్థానాల ఆదాయంలో 7% లేదా రూ.50 లక్షలను సీజీఎఫ్, ఈఏఎఫ్‌లకు జమ చేయాలంటూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ మొత్తాన్ని అర్చకులు, సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. ఇలా టీటీడీ నుంచి దాదాపు 700 కోట్లు, మిగిలిన పెద్ద దేవాలయాల నుంచి రూ.280 కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఇందులో తెలంగాణలోని దేవాలయాలకు కూడా వాటా ఉందని, ఆ మేర సొమ్ము చెల్లించేలా ఆదేశించాలని కోరారు.

Advertisement
Advertisement