ఆ సీట్లో కూర్చునే అర్హత లేదు | Sakshi
Sakshi News home page

ఆ సీట్లో కూర్చునే అర్హత లేదు

Published Thu, Apr 7 2016 2:26 AM

want to vc apparao rsignation hcu Academic Council Members

హెచ్‌సీయూ వీసీ అప్పారావుపై అకడమిక్ కౌన్సిల్ సభ్యుల మండిపాటు
తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్
సమావేశంలోనే వీసీని కడి గేసిన సభ్యులు.. పలువురు వాకౌట్
చీఫ్ ఎగ్జామినర్ పదవి నుంచి తప్పుకున్న ప్రొఫెసర్ కృష్ణ

సాక్షి, హైదరాబాద్: ‘‘మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వైస్ చాన్స్‌లర్ పదవికి మీరు అనర్హులు..’’ అంటూ హెచ్‌సీయూ వీసీ అప్పారావును వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సభ్యులు కడిగిపారేశారు! వీసి పదవికి తక్షణమే రాజీనామా చేయాలంటూ పలువురు సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వీసీ అప్పారావు బుధవారం తన నివాసంలోనే వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వీసీపై మండలి సభ్యులు మండిపడ్డట్టు తెలిసింది. కౌన్సిల్ భేటీని రద్దు చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా వీసీ తన కుర్చీ పట్టుకు వేలాడుతున్నారని ప్రొఫెసర్లు దుయ్యబట్టారు. కౌన్సిల్‌లోని సగం మందికిపైగా సభ్యులు ఈ భేటీకి హాజరుకాలేదు. హాజరైన వారిలో కొందరు వీసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే బయటకు వచ్చారు. మిగిలిన వారు వీసీపై నిరసన ప్రకటిస్తూ సమావేశంలోనే పాల్గొన్నట్టు సమాచారం.

 పరిశోధక వ్యాసాలు కాపీ కొట్టారు
ప్రముఖ రచయిత్రి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్ ఈ భేటీలో కౌన్సిల్ ఎక్సటెర్నల్ మెంబర్ హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వీసీపై నిప్పులు చెరిగారు. ‘‘పరిశోధక వ్యాసాలను కాపీ కొట్టిన మీకు ఈ కుర్చీలో కూర్చునే నైతిక అర్హత లేదు. మీరు ఆ స్థానంలో కూర్చోవడాన్ని నేను అంగీకరించలేను. మీపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరుగుతోంది. మీరు చూపిన వివక్ష వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్నో స్వచ్ఛంద కమిటీలు తేల్చి చెప్పాయి. 2007 నుంచి 2014 వరకు ఏడేళ్లలో మీరు రాసిన పరిశోధక వ్యాసాల్లో ఇతరుల వాక్యాలను నేరుగా కాపీ కొట్టారు.

ఒక ఉన్నతమైన విద్యాసంస్థకు అధిపతిగా ఉండాల్సిన వీసీ.. కాపీ కొట్టినట్లు వెల్లడైన తర్వాత ఇక ఆ పదవిలో కొనసాగే అర్హత ఉండదు’’ అంటూ ఆమె అప్పారావు ముఖం మీదే అన్నారు. తక్షణమే వీసీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు ప్రొఫెసర్ శ్రీపతిరాముడు మద్దతు పలికారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన అప్పారావుకు వీసీగా కొనసాగే అర్హత లేదంటూ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ప్రొఫెసర్ దీపా శ్రీనివాస్, ప్రొఫెసర్ సునీతారాణి, ప్రొఫెసర్ రత్నం కూడా వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భేటీ నుంచి బయటకు వచ్చారు.

 చీఫ్ ఎగ్జామినర్ రాజీనామా
వీసీ అప్పారావు అధ్యక్షతన పని చేయలేనంటూ అకడమిక్ కౌన్సిల్ కన్వీనర్ వి.కృష్ణ.. చీఫ్ ఎగ్జామినర్ పదవికి రాజీనామా చేశారు. అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా మళ్లీ పదవి చేపట్టడం దుర్మార్గమంటూ ఆయన కూడా సమావేశాన్ని బహిష్కరించారు. అప్పారావు పదవి నుంచి తప్పుకోవడమొక్కటే సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement