వరంగల్ ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్ | Sakshi
Sakshi News home page

వరంగల్ ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్

Published Wed, May 11 2016 3:32 PM

వరంగల్ ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్

తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో వరంగల్ జిల్లా ఉత్తీర్ణతలో మొదటిస్థానంలో ఉండగా, హైదరాబాద్ జిల్లా చిట్టచివర నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే అధిక శాతం ఉత్తీర్ణతను సాధించారు. బాలుర కంటే బాలికలు 1.87 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 2,62,187 మంది బాలురు హాజరు కాగా 2,22,071 మంది (84.70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికలు 2,57,307 మంది హాజరు కాగా, 2,22,757 మంది (86.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం విడుదల చేశారు. ఈసారి పదోతరగతి పరీక్షలకు మొత్తంగా 5,55,265 మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,19,494 మంది హాజరు కాగా 4,44,828 మంది (85.63 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 35,771 మంది హాజరు కాగా 14,136 మంది (39.52 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఈసారి 2,379 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించగా, 10 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఇక రాష్ట్రంలో 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ ప్రథమ స్థానంలో నిలువగా, 76.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ గురుకులాలు 96.84 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలలు 77.80 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.జిల్లా పరిషత్తు, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 85.63 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలురాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతశాతం కంటే  కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement