డీఆర్‌టీలకు పూర్తిస్థాయి పీవోలు ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

డీఆర్‌టీలకు పూర్తిస్థాయి పీవోలు ఎప్పుడు?

Published Sun, Sep 4 2016 1:00 AM

డీఆర్‌టీలకు పూర్తిస్థాయి పీవోలు ఎప్పుడు? - Sakshi

- 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
కేసు తదుపరి విచారణ 20కి వాయిదా

 సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవహారాలు, రుణాల ఎగవేత తదితర కీలక వ్యవహారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు హైదరాబాద్, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసిన డెట్ రికవరీ ట్రిబ్యునళ్లకు (డీఆర్‌టీ) పూర్తిస్థాయి ప్రిసైడింగ్ అధికారులను నియమించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న డీఆర్‌టీలకు పూర్తిస్థాయి ప్రిసైడింగ్ (పీవో) అధికారులను నియమించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర ఆర్థిక, న్యాయశాఖల కార్యదర్శులను ఆదేశించింది. 3 వారాల్లోపు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని పక్షంలో ఆయా శాఖల కార్యదర్శులను కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైదరాబాద్ డీఆర్‌టీకి పూర్తిస్థాయి ప్రిసైడింగ్ అధికారిని నియమించకపోవడాన్ని ప్రశ్నిస్తూ హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పి.రవిప్రసాద్ వాదనలు వినిపించారు.

Advertisement
Advertisement