మాకు దిక్కెవరు? | Sakshi
Sakshi News home page

మాకు దిక్కెవరు? మాకు దిక్కు ఎవరు

Published Mon, Aug 29 2016 11:45 PM

విలపిస్తున్న భార్య సరిత, కూతురు హారిక - Sakshi

గచ్చిబౌలి:  కూతురుకు మాదాపూర్‌లోని అమెజాన్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉండటంతో ఆమెను అక్కడ వదలి తిరిగి వెళుతున్నాడు గంగినేని వెంకన్న.. అయితే మృత్యువు ఆయనను బస్సు రూపంలో వెంటాడింది.. కేపీహెచ్‌బీకి వెళుతుండగా మార్గమధ్యలో చిరెక్‌ స్కూల్‌ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్‌ పెట్టుకున్నా బస్సుచక్రం మీద నుంచి వెళ్లడంతో హెల్మెట్‌ పగిలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం జరిగింది. పెద్దముప్పారం వరంగల్‌ జిల్లాకు చెందిన గంగినేని వెంకన్న బొల్లారంలోని ఎంఎస్‌ఎల్‌ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు.
 
కేపీహెచ్‌బి 4వ ఫేజ్‌లో  భార్య సరిత, కూతుళ్లు ప్రియాంక, సారిక, మౌనికతో నివాసముంటున్నాడు. ప్రియాంక పెళ్లి చేయగా ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయాల్సి ఉంది. వెంకన్న మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. తన భర్త మృతితో తాము దిక్కులేనివారమయ్యామని, మమ్మల్నెవరు ఆదుకుంటారని మృతుడి భార్య సరిత గుండెలవిసేల విలపించింది. మధ్యాహ్నం వరకు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్న తన భర్త మృతదేహాన్ని చూపించకుండానే ఉస్మానియాకు తరలించారని వాపోయింది.  రేపు వస్తే రూ.20 వేలు ఇస్తామని చెప్పారని, పేదలకు న్యాయం చేయడమంటే ఇదేనా అని ప్రశ్నించింది. 
 
పాఠశాల ఎదుట ఆందోళన 
 స్కూల్‌ బస్సు ఢీ కొని మృతి చెందిన గంగినేని వెంకన్న కుటుంబ సభ్యులు, బందువుల సోమవారం రాత్రి కొండాపూర్‌లోని చిరెక్‌ స్కూల్‌ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో బొటానికల్‌ గార్డెన్, మసీబండ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. గచ్చిబౌలి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు నచ్చచెప్పడంతో బాధితులను శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. యాజమాన్యం దిగి రాకపోతే మంగళవారం కూడా స్కూల్‌ ముందు ధర్నా నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. మూడవ కూతురు ఎంబీఎ మొదటి సంవత్సరంలో చేరేందుకు కౌన్సిలింగ్‌కు వెళ్లిందని బంధువులు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement