ఆ ఇద్దరూ ఎవరు? | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ ఎవరు?

Published Wed, May 25 2016 2:57 AM

ఆ ఇద్దరూ ఎవరు? - Sakshi

రాజ్యసభ అభ్యర్థులపై  టీఆర్‌ఎస్‌లో సస్పెన్స్
- ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసిన సీఎల్ రాజం
అధినేత ప్రకటన కోసం  ఎదురుచూపులు
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థిత్వాలపై అధికార టీఆర్‌ఎస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ సైతం షురూ అయ్యింది. రాష్ట్రంలో ఉన్నవి రెండు స్థానాలే కావడంతో పార్టీలోని పలువురు సీనియర్లు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇప్పటికే వారంతా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును పలుమార్లు కలసి విజ్ఞప్తి చేశారు. అయితే అవకాశం ఎవరికి వస్తుందో అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతోంది. మరోవైపు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న నేతలు అధినేత ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

పార్టీ వర్గాల్లో ముందు నుంచీ ప్రచారంలో ఉన్న పేర్లే అయినా నిత్యం చర్చ కొనసాగుతూనే ఉంది. ఉన్న రెండు సీట్లకు గిరాకీ పెరగడంతో అధినేత కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో పాలేరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయ్యింది. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి ఉన్న పోటీని కొంత వరకు తగ్గించేందుకు వెసులుబాటు చిక్కిందని విశ్లేషిస్తున్నారు.

 కేసీఆర్‌తో సీఎల్ రాజం భేటీ
 రాజ్యసభ స్థానం కోసం పోటీపడుతున్న నేతలు సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మంగళవారం సీఎల్ రాజం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా రాజ్యసభ రేసులో ఉన్న వారే కావడంతో ఈ భేటీపై పార్టీలో చర్చ ఊపందుకుంది. మొదటి నుంచీ కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్న సీఎల్ రాజం కొద్ది నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని మోదీని సైతం కలిశారు. అయినా, ఆ పార్టీలో ఆయన అంత చురుగ్గా లేరు. ఇప్పటికీ బీజేపీకి ఎలాంటి రాజీనామా సమర్పించలేదు. కాగా, రాజ్యసభ ఎన్నికలు ఖరారు కాగానే టీఆర్‌ఎస్ కోటాలోనే ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీ కోశాధికారిగా పనిచేసిన దామోదర్‌రావు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నల్లగొండ జిల్లాకు చెందిన తేరా చిన్నపరెడ్డి రేసులో ఉన్నారు. అయితే, కేసీఆర్ ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.
 
 పోటీ తగ్గించే వ్యూహంలో గులాబీ బాస్
 రెండు స్థానాలనూ ఓసీలకే ఇవ్వడం ఇబ్బందికరమనే భావన అధినేతలో ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో పోటీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పదవుల ఆశ చూపుతున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే బావుంటుందని, ఇప్పటికే ఆయన తనయుడు సతీష్ ఎమ్మెల్యేగా ఉండడం, పార్లమెంటరీ కార్యదర్శిగా మొదటి విడతలోనే అవకాశం కల్పించినందున కెప్టెన్ కుటుంబానికి సముచిత గౌరవం ఇచ్చినట్లే అన్న విశ్లేషణ పార్టీలో జరిగిందని సమాచారం. రాజ్యసభ సీటును ఆశిస్తున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఒప్పించి, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌గా పదవి కట్టబెట్టేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దామోదర్‌రావుకు ఒక సీటు దాదాపు ఖాయమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన ఒక స్థానానికి అధినేత ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement