ఆశల చిగుళ్లు! | Sakshi
Sakshi News home page

ఆశల చిగుళ్లు!

Published Wed, Mar 29 2017 12:32 AM

ఆశల చిగుళ్లు! - Sakshi

డబుల్‌ ఇళ్ల నిర్మాణంపై కదలిక
వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా లక్ష ఇళ్ల నిర్మాణం
ప్రత్యేకంగా పీఎంయూ ఏర్పాటు
ఇప్పటికే 16,562 ఇళ్లకు టెండర్లు పూర్తి
మరుసటి విడతలో 70 వేల ఇళ్లకు ఒకేసారి...


మంత్రుల సమీక్షలో నిడబుల్‌ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 16562 ఇళ్లకు టెండర్లు పూర్తవగా..మిగతా వాటికి రెండు విడతల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ఏర్పాటు చేయాలని మంత్రులు భావిస్తున్నారు. డబుల్‌ ఇళ్ల నిర్మాణం పేదల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలని..ఇందుకు అనుగుణంగా పథకం మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలకు దక్కిన ఇళ్లను ఇతరులకు  అమ్ముకోకుండా...తప్పనిసరిగా నివాసం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. తద్వారానే పేదల జీవన ప్రమాణాలు పెరిగి సామాజిక స్థాయి మెరుగవుతుందన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్‌ నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తిచేయడం లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. మంగళవారం బేగంపేటలోని మెట్రోరైలు భవనంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ అమలు తీరుపై మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే 16,562 ఇళ్ల టెండర్లు పూర్తయి, చాలా చోట్ల పనులు గ్రౌండ్‌ అయ్యాయన్నారు. మరో 16 వేల ఇళ్లకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు.  మిగతా దాదాపు 70 వేల ఇళ్లకు ఒకేసారి టెండర్లకు అనుమతి తీసుకుంటున్నామన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల తీరును నేరుగా పర్యవేక్షిస్తామని చెప్పారు. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు ముందుకొచ్చే బిల్డర్లకు జీహెచ్‌ఎంసీ తరపున కావాల్సినన్ని మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. ఎమ్మెల్యేలు నేరుగా వర్కింగ్‌ ఏజెన్సీలతో మాట్లాడటంతో ప్రస్తుతం పలు కంపెనీలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నాయన్నారు.

‘డబుల్‌’ఇళ్లతో పేదల జీవితాల్లో గుణాత్మకమార్పు: మంత్రులు
డబుల్‌బెడ్‌రూమ్‌ పథకంతో పేద ప్రజల జీవితాల్లో గుణాత్మకమార్పు వస్తుందని మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు అన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపి తమ నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. మురికివాడల్లోని పేదలను చైతన్యపరుస్తూ అక్కడ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. నగరంలో హౌసింగ్‌ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (పీఎంయూ)ఏర్పాటు చేయాల్సిందిగా హౌసింగ్‌ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కేటీఆర్‌ కోరారు. నగరంలోని ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కావాల్సిందిగా ఆయన హౌసింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో లక్షఇళ్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను నెరవేరుస్తామన్నారు.

నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ హౌసింగ్‌ స్కీమ్‌ను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల వల్ల ప్రజల జీవనప్రమాణాల్లో మార్పు వస్తుందని, లబ్ధిదారులు వీటిని అమ్ముకోకుండా కుటుంబానికి రక్షణఇచ్చేలా చూడాలన్నారు. ఈమేరకు ఈ హౌసింగ్‌స్కీమ్‌ పథకం మార్గదర్శకాల్లో ఈ నిబంధన చేర్చాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ నిబంధన లేకుంటే పేదల జీవితాల్లో మార్పు సాధ్యం కాదన్నారు. వారు ఈ ఇళ్లల్లో నివసించినప్పుడే వారి సామాజిక స్థాయిలో మార్పు వస్తుందని, ప్రభుత్వ లక్ష్యానికి సార్థకత చేకూరుతుందన్నారు. సమావేశంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, జంటనగరాల ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్‌శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement