విప్లవ స్ఫూర్తి ప్రదాత కాశీపతి కన్నుమూత | Sakshi
Sakshi News home page

విప్లవ స్ఫూర్తి ప్రదాత కాశీపతి కన్నుమూత

Published Fri, Aug 12 2016 4:11 AM

విప్లవ స్ఫూర్తి ప్రదాత కాశీపతి కన్నుమూత - Sakshi

హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, కవి, విప్లవ స్ఫూర్తి ప్రదాత యాదాటి కాశీపతి(74) గురువారం హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య పుష్పలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాశీపతి గత 12 ఏళ్లుగా పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం బాత్‌రూమ్‌లో కిందపడగా తుంటి ఎముక విరిగిపోయింది. ముషీరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో సర్జరీ అనంతరం సోమవారం డిశ్చార్జయ్యారు. గురువారం సాయంత్రం  తుదిశ్వాస విడిచారు.
 
డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వదిలి..
అనంతపురానికి చెందిన కాశీపతి చదువు పూర్తి చేసిన అనంతరం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ విప్లవ నేత చండ్ర పుల్లారెడ్డి పిలుపు మేరకు విప్లవ ఉద్యమానికి అంకితమయ్యారు. 1967 నుంచి విప్లవ ఉద్యమంలో పని చేశారు. ఎమర్జెన్సీలో 21 నెలల పాటు ముషీరాబాద్ కారాగారంలో జైలు జీవితం గడిపారు. సీపీఐఎంఎల్  తరపున సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు. 1978లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉండే  గిరిజన యువతిని పెళ్లి చేసుకున్నారు.
 
ప్రముఖుల సంతాపం..: విరసం నేత వరవరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సెక్రటేరియట్ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులు రమ, విమల, అంబిక, ఎస్.ఎల్.పద్మ, అరుణ, ఐఎఫ్‌టీయూ నాయకులు అనురాధ, పీడీఎస్‌యూ నాయకులు గౌతమ్ ప్రసాద్, సత్య, వెంకట్ తదితరులు ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్‌రావు, కె.గోవర్దన్, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ సంతాపాన్ని తెలిపారు.  కాగా, అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలకు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. వారు రాగానే అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు బంధువులు తెలియజేశారు.
 
వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు వై.కాశీపతి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీపతి గొప్ప వక్త, మంచి రచయిత, అంతకు మించి గొప్ప విలువలు కలిగిన పాత్రికేయుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాశీపతి మృతిపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సంతాపం తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement