నయా.. నేరగాళ్లు..!

7 Jul, 2014 02:25 IST|Sakshi
నయా.. నేరగాళ్లు..!

*  ‘ఈజీ మనీ’ కోసం నేరబాట పడుతున్న యువత
* 2013లో చిక్కిన వారిలో అత్యధికులు కొత్తవారే..
* 2.8 లక్షల మందిలో 2.4 లక్షల మంది మొదటిసారి అరెస్టు
* బాలబాలికల్లోనూ కనిపిస్తున్న నేరప్రవృత్తి

 
సాక్షి, హైదరాబాద్: ఆనంద్, కిరణ్.. సాధారణ యువకులు.. డబ్బు కోసం పక్కదారి పట్టారు. పక్కా స్కెచ్ వేసి హైదరాబాద్‌లోని తనిష్క్ షోరూంలో రూ. 5.97 కోట్ల బంగారం చోరీ చేసి, జనవరిలో అరెస్టు అయ్యారు. పది చోరీలు చేసి మార్చిలో వనస్థలిపురం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగల వయస్సు 17 ఏళ్లలోపే. చిన్న వయస్సులోనే వారు దొంగలుగా మారి, పలు చోట్ల లూటీ చేశారు. టాలీవుడ్‌లో ఆయనో అసిస్టెంట్ డెరైక్టర్.. కానీ, జల్సాల కోసం దొంగగా మారాడు. ఏప్రిల్‌లో మాదాపూర్ పోలీసులు అతన్ని పట్టుకోవడంతో గుట్టు రట్టయ్యింది. వీరంతా.. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరబాట పట్టినవారే.
 
గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో వివిధ నేరాల కింద 2,81,437 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో 87.4 శాతం.. అంటే 2,45,916 మందికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కొత్తగా దొంగతనాలు చేస్తూ వీరంతా పట్టుపడ్డారు. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త నేరగాళ్ల సంఖ్యలో ఉమ్మడి రాష్ర్టం దేశంలోనే ఐదో స్థానంలో ఉండడం గమనార్హం.

ఈ నయా నేరగాళ్లు పాల్పడుతున్న నేరాల్లో స్నాచింగ్‌లు, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలూ అధికంగానే ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. మారిన జీవన విధానం, సాంకేతిక విప్లవం కారణంగా గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా నేరాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు.  సొత్తు సంబంధ నేరాలకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్త వారు ఉండటం దీనికి నిదర్శనం.
 
దారితప్పుతున్న బాల్యం...
2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ర్టంలో  మొత్తం 3,133 మంది మైనర్లు వివిధ నేరాల్లో పోలీసులకు చిక్కారు. వీరిలో నిరక్షరాస్యులు, ప్రాథమిక విద్య దశలోని వారే ఎక్కువగా ఉన్నారు. పూర్తిస్థాయిలో బాలల కన్నా, యవ్వనంలో అడుగుపెడుతున్న వారే ఎక్కువగా నేరబాట పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అనాథలు, సంరక్షకుల వద్ద ఉన్న వారి కంటే తల్లిదండ్రులతో కలసి ఉంటూ నేరాలు చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం. సరైన అజమాయిషీ లేకపోవడం, ప్రేమానురాగాలు చూపకపోవడమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు