జగన్ సవాల్‌కు జవాబ్ నహీ! | Sakshi
Sakshi News home page

జగన్ సవాల్‌కు జవాబ్ నహీ!

Published Thu, Mar 17 2016 3:40 AM

జగన్ సవాల్‌కు జవాబ్ నహీ! - Sakshi

♦ రుణమాఫీ హామీపై తప్పుదోవపట్టించబోయిన టీడీపీ ఎమ్మెల్యే
♦ పంటరుణాలే మాఫీ చేస్తామన్నామని వ్యాఖ్య
♦ తీవ్రంగా ఖండించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్
♦ రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారా? లేదా?
♦ ఆ టేపును సభలో వినిపిస్తా.. తప్పని తేలితే రాజీనామా చేస్తా
♦ లేకుంటే బాబు రాజీనామా చేస్తారా? అని జగన్ సవాల్
♦ కిమ్మనకుండా కూర్చున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
 
 సాక్షి, హైదరాబాద్:  రైతు రుణమాఫీపై బుధవారంనాడు అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌కు అధికారపక్షం వైపు నుంచి జవాబే లేకపోయింది. వ్యవసాయ రుణాల మాఫీ హామీకి సంబంధించి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సవాల్ విసిరారు. వ్యవసాయ రుణాలన్నింటినీ పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికల వేళ చంద్రబాబు చెప్పారని, అలా అనలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బుధవారం అసెంబ్లీలో జగన్ ఈ సవాల్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చర్చను ప్రారంభిస్తూ పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. పంట రుణాలని తామంటే.. వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పినట్టుగా ప్రతిపక్షం దుష్ర్పచారం చేస్తోందని అన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు.

 సభలో నేను ప్లే చేస్తా, సిద్ధమేనా?
  ‘చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని నేను ప్లే చేస్తా (వీడియోను ప్రదర్శిస్తా). వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు అన్నారో లేదో నేను ప్లే చేస్తా. తాను అనలేదని అంటే నేను రాజీనామా చేస్తా, లేదంటే చంద్రబాబు రాజీనామాకు సిద్ధమేనా అని చాలెంజ్ చేస్తున్నా’ అని జగన్ అన్నారు. ఇంతమంది మంత్రులు ఇక్కడున్నారు.  వ్యవసాయ రుణాలను పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానని,బ్యాంకుల్లో పెట్టిన  బంగారం ఇంటికి రావాలన్నా  బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రూ. 87,612 కోట్లు ఉన్నాయని, ఎస్‌ఎల్‌బీసీ రికార్డులను చూపిస్తూ  ప్రతి మీటింగ్‌లోనూ చంద్రబాబు అన్న మా టలన్నీ  చెప్పా. చంద్రబాబు నుంచి ఎన్నడూ డినైయిల్ (తిరస్కరణ) రాలా’ అని జగన్ అన్నారు. ఆ తర్వాత మాట్లాడిన కూన రవికుమార్ మాత్రం.. వ్యవసాయ రుణాలు అనలేదని, కేవలం పంట రుణాలని  బాబు చెప్పారన్నారు. జగన్ సవాల్ తర్వాత మాట్లాడిన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఇప్పటిదాకా తామెంత మాఫీ చేశామో చెప్పారే తప్ప సవాల్‌పై నోరు మెదపలేదు. ప్రతి దానికీ జగన్‌పై విరుచుకుపడే మంత్రులు గానీ, టీడీపీ ఎమ్మెల్యేలు గానీ ఆయన సవాల్‌ను స్వీకరించలేదు. కనీసం స్పందించకపోవడం గమనార్హం.
 
 ఇవిగో బాబూ సాక్ష్యాలు
 ► అక్టోబర్ 14, 2012.. అనంతపురం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా
  ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తాం’
 ► 2014, ఏప్రిల్‌లో, ఒంగోలు సభలో చంద్రబాబు
  ‘రైతులందరూ అప్పుల పాలయ్యారు. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నారు. అందుకే రైతు రుణాలను బేషరతుగా మాఫీచేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది’
 ► టీడీపీ ఎన్నికల ప్రణాళిక-2014, పేజీ నెంబర్ 12
  ‘తెలుగుదేశం పార్టీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తా’

Advertisement
Advertisement