ఆ పది వేల కోట్లు ప్రకటించింది బాబు బినామీనేమో! | Sakshi
Sakshi News home page

ఆ పది వేల కోట్లు ప్రకటించింది బాబు బినామీనేమో!

Published Fri, Oct 14 2016 2:11 AM

ఆ పది వేల కోట్లు ప్రకటించింది బాబు బినామీనేమో! - Sakshi

 ప్రధానికి లేఖ రాసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ఆదాయ వెల్లడి వివరాలు ఏపీ సీఎంకు ఎలా తెలిశాయి?
 అంత కచ్చితంగా లెక్కలు తెలిశాయంటే
 ఆయన బినామీ అయి ఉండవచ్చు
 ‘ఐడీఎస్-2016’ జాబితాను బయటపెట్టాలి
 బాబు పాలనలో ఏపీ అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది
 సాక్ష్యాలతో సహా మీకు పుస్తకం సమర్పించాం
 చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు లేవు
 ఆయన అవినీతిపై విచారణ జరిపించండి

 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ‘ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్)-2016’ వివరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా తెలిశాయి? ఈ వివరాలు బయటకు పొక్కవని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో నిగూఢమైన ఈ అంశాలు తనకు తెలిసినట్లు చంద్రబాబు ఎలా చెప్పగలుగుతున్నారు? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రశ్నించారు. రహస్యమైన ఆ సమాచారం కచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే...
 
 ఆ ఆదాయాన్ని ప్రకటించిన వ్యక్తి చంద్రబాబుకు బినామీ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజా ప్రయోజనాల రీత్యా ఐడీఎస్ వివరాల జాబితాను ప్రజల ముందుంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిమాండ్ చేశారు. అంతేకాక కొంతకాలం క్రితం చంద్రబాబు అవినీతిపై సాక్ష్యాలతో సహా తాము సమర్పించిన పుస్తకంలోని అంశాలపై విచారణ జరిపించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక లేఖను రాశారు. లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.
 
 గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి,
 ‘ఆదాయ వెల్లడి పథకం ఐడీఎస్-2016’కు సంబంధించిన వివరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను మీ దృష్టికి తీసుకు రాదలిచాను. రాష్ర్టంలో కీలకమైన అధికార స్థానాల్లో ఉన్న వ్యక్తులందరినీ తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచారం చేస్తున్నారు. ‘ఐడీఎస్-2016’ వెల్లడి పథకం కింద ప్రకటించిన వివరాలు ఆ వ్యక్తుల వ్యాపారం, ఉండే నగరం, సంబంధిత రాష్ట్రం వివరాల ఆధారంగా వారి జాబితాను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కనీయమని గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెప్పారని కేంద్ర పన్నుల బోర్డు (ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్) ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ట్వీట్ చేసింది.
 
ఇలాంటి వివరాలతో కూడిన అధికారిక జాబితాను తాము విడుదల చేయలేదని కేంద్ర పన్నుల బోర్డు (సీబీడీటీ) కూడా ప్రకటించింది. దీనిపై ఇతరులు చేసే మోసపూరితమైన, తప్పుడు సందేశాలను నమ్మవద్దని కూడా సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.వాస్తవం ఇలా ఉండగా,ఎన్డీఏలో ప్రధానమైన భాగస్వామి అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ. 13,000 కోట్లు ఆదాయాన్ని ప్రకటించినట్లుగా, అందులోనూ రూ. 10,000 కోట్లు ఒకే వ్యక్తి ప్రకటించినట్లుగా నిర్ద్వంద్వంగా చెప్పారు. నిగూఢమైన ఈ సమాచారం చంద్రబాబుకే ఎలా తెలిసింది? ఈ సమాచారం తెలిసిందంటే ఆ ఆదాయాన్ని ప్రకటించిన వ్యక్తి ఆయనకు బినామీ అయి ఉండాలి.
 
లేకుంటే అంత కచ్చితంగా ఆయన లెక్కలతో సహా ఎలా చెప్పగలిగారు? చంద్రబాబు చెబుతున్న సమాచారం నిజమే అయితే దానిని ఏపీ ప్రజలమైన మేము కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా ‘ఎన్‌సీఏఈఆర్-న్యూఢిల్లీ’ సంస్థ చేసిన సర్వే నివేదికలో గణతికెక్కింది. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి అసాధారణమైన రీతిలో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని, ఆయన అవినీతి రూ.1.50 లక్షల కోట్లు దాటిందని ఆరోపణలు చేస్తూ మేం కొంతకాలం కిందట మీకు అన్ని వివరాలతో ఒక పుస్తకాన్ని సమర్పించాం.
 
మేం సమర్పిం చిన ఈ పుస్తకంలో దర్యాప్తునకు ఆదేశించడానికి అవసరమైన సాక్ష్యాధారాలను, ఇతర సమాచారాన్ని పొందుపర్చాం. మేము మీ దృష్టికి తెచ్చిన చంద్రబాబు అవినీతిపై ఇప్పటివరకూ దర్యాప్తునకు ఆదేశించలేదు. అందుకే దయచేసి చంద్రబాబు అవినీతిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తన మీద విచారణకు ఆదేశించే సాహసం భారతదేశంలో ఎవ్వరికీ లేదనే ధైర్యంతో చంద్రబాబు ఉన్నారు. ఆయన విశ్వాసం నిజమేనన్నట్లుగా... జమాఖర్చులు చూపించని కోట్ల రూపాయల అవినీతి సొమ్ము (నల్లధనం)తో ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు కాకుండా, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకుండా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ అధికారంలో కొనసాగుతున్నారు.
 
 దేశంలో ఇలాంటి రాజకీయవేత్త చంద్రబాబు ఒక్కరే. ప్రజా జీవితంలో ప్రజా ప్రయోజనాల రీత్యా నాయకులకు రుజువర్తనం ఉండాలి కనుక ‘ఐడీఎస్-2016’ జాబితా మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాక చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మనవి చేస్తున్నాను. చంద్రబాబు అవినీతి ఆరోపణలకు సంబంధించి తగినన్ని సాక్ష్యాధారాలతో మేం రూపొందించిన పుస్తకం మరో ప్రతిని కూడా ఈ లేఖతో జతపరుస్తున్నాను.
 
 గౌరవాభినందనలతో
 మీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


Advertisement

తప్పక చదవండి

Advertisement