Sakshi News home page

నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు

Published Sat, Nov 1 2014 2:24 AM

నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేతల స్పష్టీకరణ
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించడమే సముచితమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రావతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురదృష్టకరమని, దీనిని పార్టీ ఖండిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. తమ పార్టీ రాష్ట్రావతరణ వేడుకలను నవంబర్ ఒకటవ తేదీనే జరుపుకుంటుందని చెప్పారు.

ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వేరుపడినప్పటికీ మధ్యప్రదేశ్ అంతకు మునుపు జరుపుకునే తేదీనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. జార్ఖండ్ నుంచి వేరు పడిన  బీహార్, ఉత్తరాఖండ్ నుంచి వేరుపడిన ఉత్తరప్రదేశ్ అంతకుముందు జరుపుకున్న తేదీలనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటున్నాయని తెలిపారు.

ఈ సంప్రదాయాలనే ఏపీ పాటించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ వేడుకలు జరపాలన్న నిర్ణయం చేయడమంటే వారు రాష్ట్ర విభజనకు అంగీకరించారని భావించాలన్నారు. సమైక్యంగా ఉండాలని కోరుకున్న తమ పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో శనివారం రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు.

నేడు వేడుకలో జగన్‌మోహన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించే రాష్ట్రావతరణ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ తెలియజేసింది.

కేబినెట్ నిర్ణయం సరికాదు: లక్ష్మణ్ రెడ్డి
ఏపీ అవతరణ దినోత్సవం జూన్ 2న నిర్వహిం చాలని మంత్రి మండలి నిర్ణయించటం సరికాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 2 అనేది ఒక దుర్దినమన్నారు. గతంలో లాగా నవంబర్1న నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి మండలి నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించాలన్నారు.
 
జూన్ 2 నిర్ణయం ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న కాకుండా తెలంగాణ ఏర్పడిన జూన్ 2న  నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించడం పట్ల ఆంధ్రా మేధావుల, విద్యావంతుల వేదిక తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీన్ని భావ దారిద్య్రంగా  వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, పీఎస్‌ఎన్ మూర్తి, కార్యదర్శి టి. నరసింహారావు విమర్శించారు. ‘మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను చీల్చి ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

ఈ మాతృ రాష్ట్రాలేవీ కొత్తగా చీలిన దినాలను అవతరణ దినోత్సవాలుగా మార్చుకోలేదు. నవంబర్ 1ని మార్చాలనుకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములుతోపాటు 1913 నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు సల్పి సాధించుకున్న అక్టోబర్ 1ని ఏపీ అవతరణ దినోత్సవంగా ప్రకటించాల్సింది. సీమాం ధ్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర విభజనను  ప్రజలు నిరసించారు. సీఎం  వాస్తవాలు గమనించి ప్రకటనను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement