పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ దృష్టి | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ దృష్టి

Published Fri, Jul 15 2016 1:07 AM

పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ దృష్టి - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ పటిష్టత, సంస్థాగత బలోపేతంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం,  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టడంపై కార్యాచరణ రూపొందించుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు, కమిటీల నియామకాన్ని చేపట్టగా, మండల స్థాయిలో కమిటీల నియామకాన్ని పూర్తిచేయనున్నారు.  ఈ నెల 16 నుంచి 20 వరకు లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలను నిర్వహించనున్నారు.
 
16న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్లి జిల్లాల సమావేశాలు..
ఈ నెల 16న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. 18న నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు, 19న గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలు, 20న మెదక్, ఖమ్మం జిల్లాల సమావేశాలు ఉంటాయి.  ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పార్టీ పరిశీలకులు, పార్టీ సహ పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరుకావాలన్నారు.

Advertisement
Advertisement