ఇంకా మౌనమెందుకు? | Sakshi
Sakshi News home page

ఇంకా మౌనమెందుకు?

Published Sun, May 8 2016 1:28 AM

ఇంకా మౌనమెందుకు? - Sakshi

* ‘హోదా’ ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసినా మాట్లాడరేం?
* రాష్ట్రానికి ఇంతకన్నా అన్యాయం ఏం జరగాలి?
* మీరు మాట్లాడాలంటే ఇంకా రాష్ట్రం ఎంత నష్టపోవాలి?
* పోరాటానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
* కలసి పోరాడదాం.. రమ్మన్నా స్పందించరేం?
* చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని, నూతన రాజధానికి ఎలాంటి రాయితీలు ఉండబోవని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా మొండిచేయి చూపాక కూడా సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని, పోరాటానికి ఎందుకు సిద్ధం కావట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.

శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా కేంద్రాన్నిగానీ, బీజేపీనిగానీ ఏమీ అనొద్దని టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని చంద్రబాబు ఎందుకు నియంత్రిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబు మౌనంగా ఉండటం వెనకున్న ఆంతర్యమేమిటన్నారు. ‘చంద్రబాబు ఇంకా ఎందుకు మాట్లాడ్డం లేదు? రాష్ట్రానికి ఇంతకన్నా అన్యాయం ఏం జరగాలి? ఆయన మాట్లాడాలంటే ఇంకా రాష్ట్రం ఎంత నష్టపోవాలి?’ అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపైగానీ, రాజధానికి రాయితీలివ్వబోమన్న విషయంపైగానీ మాట్లాడ్డం లేదంటే చంద్రబాబుకు ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు ఏముంటాయన్నారు.

ప్రాణవాయువులాంటి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలొస్తాయని, తమకు ఉద్యోగాలొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి కేంద్రం ప్రకటనతో దిక్కుతోచనివిధంగా అయిపోయిందన్నారు. పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రాలకు వెళుతున్నారేతప్ప ఏపీలో ఒక్కరూ ముందుకు రావట్లేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చుంటే.. వారంతా క్యూ కట్టేవారన్నారు.
 
స్వప్రయోజనాల కోసమే నోరుమెదపట్లేదు..
స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు మాట్లాడ్డం లేదని పద్మ ధ్వజమెత్తారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అరెస్టు చేస్తారనో... లేదా తన అవినీతిపై విచారణకు ఆదేశిస్తారనో భయపడిపోయి కేంద్రాన్ని గట్టిగా అడుగలేకుండా ఉన్నారని విమర్శించారు. తాను పోరాడకపోగా తన పార్టీలో ఒకరిద్దరు నేతలు రాష్ట్రప్రయోజనాలపై ఆవేదనతో మాట్లాడుతుంటే వారి నోళ్లను నొక్కేస్తున్నారన్నారు. కేంద్రమంత్రుల ప్రకటనల వల్ల రాష్ట్రం నిండా మునిగిందన్న విషయం చంద్రబాబుకు తెలిసి కూడా ఇంకా వారు సాయం చేస్తారేమోనని అర్రులు చాచడమేమిటన్నారు.

ప్రత్యేకహోదా సాధనకోసం పోరాడుదాం రమ్మని రెండురోజులుగా వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తున్నా చంద్రబాబుగానీ, టీడీపీ నేతలుగానీ స్పందించట్లేదని ఆమె విమర్శించారు. తమ పోరాటంలో కలసిరావాలని లేదా అధికారపక్షమే పోరాటం చేస్తే కలసి నడవటానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అందరం కలసికట్టుగా ఉద్యమించి బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకహోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఢిల్లీకి తెలుస్తుందని సూచించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి టీడీపీ ఏ కార్యాచరణ రూపొందిస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement