‘యువభేరి’ సైడ్‌లైట్స్.. | Sakshi
Sakshi News home page

‘యువభేరి’ సైడ్‌లైట్స్..

Published Mon, Aug 12 2013 1:09 AM

‘యువభేరి’ సైడ్‌లైట్స్.. - Sakshi

అబిడ్స్/దత్తాత్రేయనగర్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ :నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘నవభారత యువభేరి’ బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభకు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సారథి నరేంద్రమోడీ రావడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 12 గంటల నుంచే ప్రజలు తరలివచ్చారు.
 
 ఎల్బీ స్టేడియం జనంతో కిక్కిరిసిపోవడంతో ఆలస్యం గా వచ్చిన వేలాది మంది బయటే ఉండిపోయారు.
 
 పబ్లిక్‌గార్డెన్, ఎఫ్‌ఎంసీ, నిజాం కాలేజీ, గన్‌పార్కు ప్రాంతాలలో ఎల్‌సీడీలను ఏర్పాటు చేసి మోడీ ప్రసంగాన్ని ప్రసారం చేశారు.
 
 జనం రాకతో ఎల్బీ స్టేడియం నుంచి నాంపల్లి రోడ్డు, బషీర్‌బాగ్, లక్డీకాపూల్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.
 
 మహిళలు స్టేడియం వీఐపీ గేటు వద్దకు తరలిరావడంతో పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో వారు నినాదాలు చేశారు.
 
 వీఐపీ గేటు, ప్రెస్ గ్యాలరీలలోకి మీడియా ప్రతినిధులను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు.
 
 ప్రధాన వేదిక వద్ద స్వామి వివేకానంద, సర్దార్ వల్లాభాయ్ పటేల్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.
 
 నరేంద్రమోడీ తెలుగులో చేసిన ప్రారంభ ప్రసంగం సభలోనివారిని ఆకట్టుకుంది.
 
 మోడీ ప్రసంగించినప్పుడు వేదికపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి తీగల నుంచి పొగ వెలువడింది. కొంత మంది కేకలు వేయడంతో వెంటనే పోలీసులు సరిచేశారు.
 
 అమెరికా, లండన్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత సభకు హాజరయ్యారు.
 
 వివేకానందుడి వేషధారణలో సభకు వచ్చిన బాలుడు ఆకట్టుకున్నాడు.
 
 సభకు ప్రవేశ రుసుంగా వసూలు చేసిన రూ.10 లక్షలను కిషన్‌రెడ్డి బీజేపీ కేంద్ర కోశాధికారికి అందజేశారు.
 
 హైదరాబాద్‌కు, గుజరాత్‌కు ఎంతో సంబంధం ఉందని, గుజరాత్‌గడ్డపై పుట్టిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేశారని గుర్తు చేశారు.
 
 జెతైలంగాణ, జై సీమాంధ్ర అంటూ నరేంద్రమోడీ సభలో ఉన్న వారితో అనిపించారు. గుజరాత్‌లో కూడా లక్షలాది మంది తెలుగువారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని గుర్తు చేశారు.
 
 నవభారత్ నిర్మాణ్‌లో భాగంగా 100 సభలు నిర్వహించ తలపెట్టగా మొదటి సభ హైదరాబాద్‌లోనే నిర్వహించడం గర్వకారణమని మోడీ పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement