100 మంది ఉగ్రవాదుల హతం | Sakshi
Sakshi News home page

100 మంది ఉగ్రవాదుల హతం

Published Sat, Feb 18 2017 4:07 AM

100 మంది ఉగ్రవాదుల హతం - Sakshi

ప్రార్థనా స్థలంపై దాడికి పాక్‌ సైన్యం ప్రతీకారం
ఇస్లామాబాద్‌/కరాచీ: సింధ్‌లోని సూఫీ ప్రార్థనా స్థలంలో ఐసిస్‌ ఆత్మాహుతి దాడికి పాకిస్తాన్  ప్రతీకార దాడులకు దిగింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. శుక్రవారం 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. సింధ్‌లోని లాల్‌  ఖలందర్‌ సూఫీ ప్రార్థనామందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 88 మంది పౌరులు మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్‌ భద్రతా దళాలు దేశవ్యాప్తంగా దాడులను తీవ్రతరం చేశాయి. (చదవండి: పాక్‌లో ఆత్మాహుతి దాడి : 70 మంది మృతి)

దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు అఫ్గానిస్తాన్ నుంచి సహకారం అందుతోందని గుర్తించామని పాక్‌ ఆర్మీ మీడియా ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలో తోర్ఖాన్  సమీపంలోని అఫ్గాన్  సరిహద్దును మూసివేసినట్టు తెలిపారు.  అయితే ఏయే ప్రాంతాల్లో ఉగ్రవాదులను హతమార్చిందీ, ఎక్కడెక్కడ అరెస్టులు చేసిందీ వెల్లడించలేదు.  అఫ్గాన్‌ నుంచి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్  76 మంది అనుమానితుల జాబితాను పాక్‌కు అందించింది. మరోవైపు సూఫీ ప్రార్థనా మందిరంలో ఆత్మాహుతి దాడి తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించుకుంది.

మందిరంపై ఉగ్ర దాడికి నిరసనగా పాక్‌ ప్రజలు, ప్రజాసంఘాల వారు శుక్రవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రార్థనా మందిరానికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సెహ్వాన్  పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసు వాహనాలకు నిప్పంటించారు. రాస్తారోకో చేపట్టారు. కాగా, ఐసిస్‌ దాడికి వెరవకుండా లాల్‌ షాబాజ్‌ కలాందర్‌ సూఫీ మందిరంలో శుక్రవారం ప్రజలు రోజూవారీ కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాస్తమ ప్రార్థనల తరువాత సంప్రదాయ నృత్యం ధమాల్‌ను కూడా ప్రదర్శించారు. మందిరం గోడలు, నేలపై  నెత్తుటి మరకలు అలాగే ఉన్నాయి. బాధితుల పాదరక్షలు, ఇతర వస్తువులు కుప్పలుగా పడిఉన్నాయి.

Advertisement
Advertisement