కరోనాను జయించిన 106 ఏళ్ల బామ్మ | Sakshi
Sakshi News home page

కరోనా: నిజంగా తను అద్భుతమైన వ్యక్తి!

Published Thu, Apr 16 2020 11:46 AM

106 Year Old Woman Beat Corona Virus In UK - Sakshi

లండన్: ఓవైపు కరోనా వైరస్‌ కోరలు చాస్తూ బెంబేలెత్తిస్తుంటే... కొంత మంది వృద్ధులు ఆ మహమ్మారిని జయించి ఆశా దీపాలుగా నిలుస్తున్నారు. ఇటలీ, టర్కీలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోగా తాజాగా ఇంగ్లండ్‌లో 106 ఏళ్ల బామ్మ కోవిడ్‌-19పై విజయం సాధించారు. తద్వారా బ్రిటన్‌లో కరోనా నుంచి కోలుకున్న అత్యధిక వయస్సు గల మహిళగా నిలిచారు. సెంట్రల్‌ ఇంగ్లండ్‌కు చెందిన కోనీ టీచెన్‌(106)అనే మహిళ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో బర్మింగ్‌హాం సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. మూడు వారాల పాటు మహమ్మారితో పోరాడి కోలుకున్నారు. దీంతో కరతాళ ధ్వనుల మధ్య డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆమెను ఇంటికి సాగనంపారు.

ఈ విషయం గురించి కోనీ టిచెన్‌ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణాంతక వైరస్‌పై పోరులో విజయం సాధించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇంటికి వెళ్లాక రుచికరమైన భోజనం చేస్తానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక కోనీ మనుమరాలు అలెక్స్‌ జోన్స్‌ మాట్లాడుతూ.. తమ బామ్మ ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారని.. తన పనులు తానే చేసుకుంటారని వెల్లడించారు. స్వయంగా వంట చేసుకుంటారని.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు.(టర్కీలో అద్భుతం.. కేవలం 10 రోజుల్లోనే..

అదే విధంగా కొన్ని నెలల క్రితం కోనీకి హిప్‌ ఆపరేషన్‌ జరిగిందని.. అయినప్పటికీ నెల రోజుల వ్యవధిలోనే తిరిగి నడవడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తన బామ్మ అద్భుతమైన వ్యక్తి అని.. తనకు ఉన్న మంచి అలవాట్ల వల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని కినీపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆస్పత్రిలో కినీకి సేవలు అందించిన నర్సు సైతం ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా 1913లో జన్మించిన కోనీ.. రష్యా విప్లవం(1917) సహా రెండు ప్రపంచ యుద్ధాలకు సాక్షిగా నిలిచారు. ప్రస్తుతం మహమ్మారి ప్రభావం నుంచి బయటపడి సరికొత్త రికార్డు నెలకొల్పారు.(ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కేసులు)

Advertisement
Advertisement