2015 వార్తల్లో వ్యక్తులు | Sakshi
Sakshi News home page

2015 వార్తల్లో వ్యక్తులు

Published Thu, Dec 24 2015 1:32 PM

2015 వార్తల్లో వ్యక్తులు - Sakshi

మరో కొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2015లో వార్తల్లో నిలిచిన వివరాల్లోకి వెళితే...
 
 జుకర్‌బర్గ్  భారీ విరాళం
తండ్రయిన సందర్భంగా  ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(31) ఫేస్‌బుక్‌లోని 99 శాతం షేర్లను దానం చేశారు. ఈ షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్‌లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు.  ‘చాన్ జుకర్‌బర్గ్ ఇన్షియేటివ్’ పేరుతో మానవ వనరుల సామర్థ్యం పెంపు, అందరూ సమానమే అనే భావన పెంచే దిశగా..ముందు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు  ప్రకటించారు.
 
 ఎవరెస్ట్‌ను అధిరోహించిన చిన్నారులు
 భారత్‌కు చెందిన కందర్ప్ శర్మ (5), రిత్విక (8) ఆగస్టు రెండో వారంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. వీరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన అక్కాతమ్ముళ్లు. అతి తక్కువ వయసులో 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టును అధిరోహించిన వీరు రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ రికార్డు హర్షిత్ (5 సంవత్సరాల 11 నెలలు) పేరున ఉంది.
 
 గూగుల్ సీఈఓగా పిచాయ్
 ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భారత్‌కు చెందిన సుందర్ రాజన్ పిచాయ్(43) నియమితులయ్యారు. చెన్నైలో జన్మించిన రాజన్ పిచ్చై 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చదివారు. 2004లో గూగుల్ సంస్థలో చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆవిష్కరణకు నేతత్వం వహించారు.
 
 గౌరవనీయ వ్యక్తి మండేలా
 
 ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన అత్యంత గౌరవనీయ వ్యక్తుల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఈ జాబితాను అక్టోబరు 28నవిడుదల చేసింది. 2015 సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో పోప్ ఫ్రాన్సిన్ రెండో స్థానంలో, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ ముస్క్ మూడోస్థానంలో ఉన్నారు. మహాత్మాగాంధీకి నాలుగోస్థానం దక్కింది.
 
 అంగారకయాత్రకు సునీతా విలియమ్స్
 
 అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2030లో చేపట్టే మానవసహిత అంగారక యాత్రకు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(49)తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అక్కడి నుంచి అంగారకుడి వద్దకు పర్యాటకులను తీసుకెళ్లే వాణిజ్య యాత్రలకు రవాణా సేవలు అందించేందుకు వారికి శిక్షణ ఇస్తారు.
 
 మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
 
 అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్(55) అరెస్టయ్యారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఇండోనేసియాలోని బాలిలో ఆ దేశ పోలీసులు అక్టోబర్ 26న రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జే అలియాస్ మోహన్ కుమార్ అలియాస్ నానా కోసం భారత్ గత రెండు దశాబ్దాలుగా గాలిస్తోంది. ఆయనపై అనేక కేసులున్నాయి.
 
 సీజే గా ఠాకూర్
 సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తీరథ్‌సింగ్ ఠాకూర్ డిసెంబరు 3న ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పదవీ విరమణతో ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు.
 
 ఇస్రో చీఫ్‌గా కిరణ్‌కుమార్
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చీఫ్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త  కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. ఆయన మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. ఆయన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డెరైక్టర్‌గా పని చేశారు.
 
 కలాం అస్తమయం
 
 భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం (84) షిల్లాంగ్‌లో జూలై 27న మరణించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో లివబుల్ ప్లానెట్ అనే అంశంపై ఉపన్యసిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. ఆయన్ను సమీపంలోని బెథనీ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. అబ్దుల్ కలాం 1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించారు.
 
 ఆర్‌కే లక్ష్మణ్ కన్నుమూత
 
 ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్(94) జనవరి 26న పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్‌లో జన్మించారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు.
 
 సింగపూర్ జాతిపిత  లీ క్వాన్ యూ మృతి
 
 సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ (91) సింగపూర్‌లో మార్చి 23న మరణించారు. మలేసియా నుంచి సింగపూర్ విడిపోవడంలో ప్రధానపాత్రపోషించారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు లీ క్వాన్ ఎంతో కృషిచేశారు. లీ 31 ఏళ్ల పాటు 1959 నుంచి 1990లో పదవి నుంచి వైదొలగే వరకు ప్రధానిగా పనిచేశారు.
 
 అరుణ షాన్‌బాగ్ మృతి
 
 42ఏళ్లు అచేతన స్థితిలో ఉన్న అరుణ షాన్‌బాగ్ (67) ముంబైలో మే 18న మరణించింది.  కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న అరుణపై అదే హాస్పిటల్‌లో వార్డ్‌బాయ్ సోహన్‌లాల్ 1973లో అత్యాచారం చేసి గాయపరచగా ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని పింకీ ఇరానీ అనే జర్నలిస్టు వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.  
 
 పర్వతారోహణలో గ్రాండ్‌స్లామ్ సాధించిన కవలలు

 భారత్‌కు చెందిన కవలలు తాషి, నుంగ్షి మాలిక్ (24) లు పర్వతారోహకుల గ్రాండ్‌స్లామ్ సాధించారు. ఆఫ్రికాలో టాంజానియాలోని 5895 మీటర్ల ఎతై ్తన కిలిమంజారో పర్వతాన్ని వారు అధిరోహించడంతో గ్రాండ్‌స్లామ్ పూర్తయింది. ఇప్పటికే వారు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. ఏడు ఖండాల్లో అత్యంత ఎతై ్తన శిఖరాలన్నింటినీ అధిరోహించడాన్ని పర్వతారోహకుల గ్రాండ్‌స్లామ్ అంటారు.
 
 మళ్లీ ముకేశ్‌దే అగ్రస్థానం
 సెప్టెంబర్ 24న ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన భారత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానంలో నిలిచారు. 100 మందితో భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాను ఈ మేగజీన్ రూపొందించింది. ముకేశ్ 18.9 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో నిలువగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ 18 బిలియన్ డాలర్లతో రెండోస్థానంలో, విప్రో అధినేత ప్రేమ్‌జీ 15.9 డాలర్లతో మూడోస్థానాన్ని దక్కించుకున్నారు.
 
 సీఈసీగా నసీం జైదీ
 నసీం జైదీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. మాజీ సీఈసీ హరిశంకర్ బ్రహ్మ ఏప్రిల్ 18వ తేదీన పదవీ విరమణ చేయడంతో.. జైదీ అదే నెల 19 నుంచి బాధ్యతలు స్వీకరించారు. జైదీ తనకు 65 ఏళ్లు వచ్చేవరకు అంటే 2017 జూలైవరకు పదవిలో కొనసాగుతారు. ఎన్నికల కమిషనర్లలో అత్యంత సీనియర్‌కు పదోన్నతి కల్పించే సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం ఆయన్ను సీఈసీని చేసింది.
 
 సిస్టర్ నిర్మల మృతి
 మదర్ థెరిసా వారసురాలిగా మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు నిర్వహించిన సిస్టర్ నిర్మల జోషి(81) కోల్‌కతాలో జూన్ 23న మరణించారు. మదర్ థెరిసా మరణానంతరం 1997, మార్చి 13న సిస్టర్ నిర్మల మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా ఎంపికయ్యారు. నిర్మల జోషి నాటి బిహార్‌లోని రాంచీలో 1934లో జన్మించారు. ఆమెకు 2009లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ప్రస్తుతం మిషనరీస్ ఆఫ్ చారిటీకి సిస్టర్ మేరీ ప్రేమ నేతత్వం వహిస్తున్నారు.
 
 
 
  *బ్రిటన్‌లోని ప్రముఖ సంస్థ రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ ఎన్నికయ్యారు
     *విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు.
    *విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సీనియర్ నేత అశోక్ సింఘాల్(89) నవంబర్ 17న మరణించారు.
    * హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు మోహన్‌లాల్ ముంజాల్ (92) ఢిల్లీలో నవంబరు 1న మృతి చెందారు.
     *‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’గా హెచ్‌పీసీఎల్ సీఎండీ వాసుదేవ నిలిచారు.
    *ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాక్‌గార్డెన్ సృష్టికర్త నేక్ చంద్(90) చండీగఢ్‌లో జూన్ 12న మరణించారు.
    *ప్రముఖ వాస్తుశిల్పి చార్లెస్ కొరియా(84) ముంబైలో జూన్ 16న మరణించారు.
    *ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) నూతన అధ్యక్షునిగా కిరణ్ బీ వదోదరియా ఎన్నికయ్యారు.
    *డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్‌గా ఎం.సత్యవతి జనవరి 5న నియమితులయ్యారు.
    *ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరో గవర్నర్‌గా కృష్ణ కాంత్ పాల్ జనవరి 8న ప్రమాణస్వీకారం చేశారు.
    * నీతి ఆయోగ్‌కు సీఈఓగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్‌ను నియమించారు.
   *బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సురేందర్ కుమార్ సిన్హా (64)      జనవరి 13న ప్రమాణ స్వీకారం చేశారు.

    *కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్‌పర్సన్‌గా చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ జనవరి 19న నియమితులయ్యారు.
    *బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్)గా జనవరి 16న అనుపమ్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు.
    *ఎస్.జైశంకర్‌ను భారతవిదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జనవరి 28న నిర్ణయం తీసుకుంది.
    *కేంద్ర సంగీత నాటక అకాడమీ నూతన చైర్మన్‌గా శేఖర్‌సేన్ నియమితులయ్యారు.
    *హిందుస్తాన్ ఏరోనాటిక్స్ చైర్మన్‌గా  టి.సువర్ణ రాజు(56) జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు
     * సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి కె.దుర్గాప్రసాద్ జనవరి 29న బాధ్యతలు చేపట్టారు.
    *ఐటీబీపీ నూతన డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి కృష్ణ చౌదరి జనవరి 30న నియమితులయ్యారు.
     *ఎల్.సి.గోయల్‌ను హోంశాఖ నూతన కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4న నియమించింది.
     *భారత్ డైననమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీగా వారణాసి ఉదయ భాస్కర్ నియమితులయ్యారు.
     *ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్ జానకీ వల్లభ్ పట్నాయక్ ఏప్రిల్ 21న మరణించారు.

     *రాజస్థాన్‌లోని ‘జల్ భగీరథి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పృథ్వీరాజ్ సింగ్ ప్రపంచ జల మండలి గవర్నరుగా నవంబర్ 16న ఎంపికయ్యారు.


     *దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తి గట్టయ్య(40) హైదరాబాద్‌లో అక్టోబరు 31న మృతి చెందాడు.
     *బ్రిటన్‌లో భారత కొత్త హైకమిషనర్‌గా దౌత్యవేత్త నవతేజ్ సింగ్ సర్న అక్టోబరు 31న నియమితులయ్యారు.
     *నాస్తికోద్యమ నేత, సంఘ సంస్కర్త గోపరాజు లవణం(86) విజయవాడలో ఆగస్టు 14న మరణించారు.
    *లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ (42) తన సహచరుడు గాథియర్ డెస్టెనేను మే 15న వివాహం చేసుకున్నారు.
    *సీనియర్ ఐఏఎస్ అధికారి జి.మోహన్ కుమార్ రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా మే 22న నియమితులయ్యారు.
    * బ్రిక్స్ దేశాలు ఏర్పాటుచేసిన న్యూ డెవలప్‌మెంటల్ బ్యాంకుకు  కె.వి.కామత్ చైర్మన్‌గానియమితులయ్యారు.
    *అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదా అగ్రనేత నాసిర్ అల్-ఉహాయిషీ మరణించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement