500 మంది ఉగ్రవాదులకు ఉరి! | Sakshi
Sakshi News home page

500 మంది ఉగ్రవాదులకు ఉరి!

Published Tue, Dec 23 2014 1:56 AM

500 మంది ఉగ్రవాదులకు ఉరి!

  • త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్న పాకిస్తాన్
  • పెషావర్ పాఠశాలలో మారణకాండ నేపథ్యంలో నిర్ణయం
  • తొలుత 55 మందిని ఉరితీయనున్నట్లు అధికారుల వెల్లడి
  • గత నాలుగు రోజుల్లోనే ఆరుగురికి మరణశిక్ష అమలు
  • ఇస్లామాబాద్: తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు దేశంలోనే దారుణ మారణకాండను సృష్టిస్తుండడంతో.. పాకిస్తాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయంగా తలెత్తుకోలేని పరిస్థితి రావడంతో ఉగ్ర కార్యకలాపాలను నియంత్రించే పనిలో పడింది. కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్లో దోషులుగా నిర్ధారించిన 500 మందికి వరుసగా మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించింది.  తొలుత 55 మందికి ఈ శిక్షను అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.

    పాక్‌లో మరణశిక్షల అమలుపై ఐదేళ్లుగా ఉన్న మారటోరియాన్ని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎత్తివేసిన కొద్దిరోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెషావర్ సైనిక పాఠశాలలో గత మంగళవారం తాలిబాన్ ఉగ్రవాదులు చొరబడి 133 మంది చిన్నారులు సహా 149 మందిని కాల్చి చంపి దారుణ మారణకాండను సృష్టించడం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్‌కు సానుభూతితో పాటు ఉగ్రవాదాన్ని నియంత్రించలేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

    ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్‌లో 2008 నుంచి మరణశిక్షల అమలుపై ఉన్న మారటోరియాన్ని తొలగించారు. అయితే ఈ మారటోరియం ఉన్నప్పుడే 2012లో ఒక సైనికుడిని ఉరి తీశారు. అంతేగాకుండా చాలా కేసుల్లో కోర్టులు మరణశిక్షలు విధిస్తూ వచ్చాయి. ఇలా దాదాపు 500 మందికి ఉగ్రవాద కేసుల్లో మరణశిక్షలు పడ్డాయి. ప్రస్తుతం మారటోరియం ఎత్తివేయడంతో అధికారులు గత నాలుగురోజుల్లోనే ఆరుగురు ఉగ్రవాదులను ఉరి తీశారు. మరో 500 మంది ఉగ్రవాదులకు కూడా మరణశిక్ష అమలు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
     
    వచ్చే కొద్ది వారాల్లోనే..ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్లో దోషులైన 500 మందికి వచ్చే కొద్ది వారాల్లో మరణశిక్ష అమలు చేయనున్నట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. వీరికి సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లను కూడా తమ దేశాధ్యక్షుడు మన్మూన్ హుస్సేన్ తిరస్కరించారని ఆయన వెల్లడించారు. వారిలో తొలుత 55 మందికి మరణశిక్ష అమలుచేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఉగ్రవాదులకు మరణశిక్షలు అమలు చేయడం వల్ల వచ్చే ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
     
    కోర్టుల్లోనూ వేగంగా..కోర్టుల్లో ఉన్న ఉగ్రవాద కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్‌కు ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు ఉగ్రవాదులను వరుసగా ఉరి తీస్తుండడం, ఉగ్రవాదులపై సైన్యం దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

    విమానాశ్రయాలు, జైళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించారు. కాగా.. మరణశిక్షలపై మారటోరియాన్ని ఎత్తివేయడంపై మానవ హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాకిస్థాన్‌ను కోరింది.
     

Advertisement
Advertisement