కరోనాను జయించాడు.. కానీ!

15 Jun, 2020 05:35 IST|Sakshi

బిల్లు చూసి బెంబేలెత్తాడు 

అమెరికా వాసికి రూ. 8.35 కోట్ల బిల్లు వేసిన ఆసుపత్రి

సియాటిల్‌: అమెరికాలోని సియాటిల్‌కు చెందిన మైఖేల్‌ ఫ్లార్‌ పేరు మీద ఇప్పుడు చాలా రికార్డులున్నాయి. ఒకటి, ఆయన 70 ఏళ్ల వయస్సులో కరోనాను జయించారు. రెండు, చాలా ఎక్కువ కాలం కోవిడ్‌–19తో పోరాడి, మృత్యువుపై విజయం సాధించారు. మూడు, కరోనా చరిత్రలోనే అత్యధిక మొత్తం బిల్‌ను ఆసుపత్రి నుంచి పొందారు. ఫ్లార్‌కు చికిత్స అందించిన ఇసాఖ్‌లోని స్వీడిష్‌ మెడికల్‌ సెంటర్, ఆయన చికిత్సకుగానూ 1.1 మిలియన్‌ డాలర్ల బిల్లు వేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8.35 కోట్లు. మరో రికార్డు కూడా ఉంది. ఆయన చికిత్స, అందుకైన ఖర్చు వివరాలను మొత్తం 181 పేజీల్లో పొందుపరిచి, ఒక పుస్తకంలా ఆయనకు అందించారు. ఫ్లార్‌ దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లి వచ్చాడు.

ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని డాక్టర్లు భార్య, పిల్లలకు చెప్పేశారు. నైట్‌ డ్యూటీ నర్స్‌ చివరి కాల్‌ అని చెప్పి, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడించింది. కానీ, కరోనాకు అంత ఈజీగా లొంగిపోదలచుకోలేదు ఫ్లార్‌. కరోనాతో 62 రోజుల పాటు పోరాడి విజయం సాధించాడు. ఆయనను వైద్యులు, ఇతర పేషెంట్లు అంతా ‘మిరాకిల్‌ చైల్డ్‌’ అనడం ప్రారంభించారు. డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చిన తరువాత.. 181 పేజీల పుస్తకాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పంపించారు. ఆ పుస్తకంలో చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు 1.1 మిలియన్‌ డాలర్ల బిల్లు వివరాలు కూడా ఉన్నాయి. ఆ భారీ బిల్లు చూసి ఫ్లార్‌ అవాక్కయ్యారు. బిల్లు చూసి హార్ట్‌ అటాక్‌ వచ్చినంత పనయిందన్నారు.

‘బిల్లు భారీగా ఉంటుందనుకున్నాను కానీ.. ఇంత భారీగా ఉంటుందనుకోలేద’న్నారు. ఐసీయూలో ఫ్లార్‌ ఉన్న గది అద్దె రోజుకు 9,736 డాలర్లు. ఆ ఐసోలేషన్‌ చాంబర్‌లో ఆయన 42 రోజులున్నారు. అలాగే, 29 రోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆ బిల్లు రోజుకు 2,835 డాలర్లు. మెడిసిన్స్‌ ఖర్చు మొత్తం బిల్లులో దాదాపు నాలుగో వంతు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా మల్టీ ఆర్గన్‌ ఫెయిల్యూర్‌ దిశగా వెళ్తున్న సమయంలో రెండు రోజుల పాటు అందించిన చికిత్స ఖర్చు లక్ష డాలర్లు. ఇలా అన్ని కలిసి మొత్తం బిల్లు 11 లక్షల డాలర్లయింది. అదృష్టవశాత్తూ, ఫ్లార్‌కు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది. దాంతో, బిల్లులో ఎక్కువ భాగం  చెల్లించాల్సిన పనిలేదు. అలాగే, అది కోవిడ్‌–19 కనుక మొత్తం బిల్లు చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు. బిల్లును చూడగానే ఎలా ఫీల్‌ అయ్యారన్న ప్రశ్నకు.. ‘బతికినందుకు సిగ్గుగా అనిపించింది’అని జవాబిచ్చారు ఫ్లార్‌.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు