ఇజ్రాయెల్ దాడుల్లో 90 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ దాడుల్లో 90 మంది మృతి

Published Mon, Jul 21 2014 1:23 AM

ఇజ్రాయెల్ దాడుల్లో 90 మంది మృతి

425కు చేరిన పాలస్తీనా మృతుల సంఖ్య  
 
గాజా/జెరూసలెం: గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా గగన, భూతలాల నుంచి ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో ఆదివారం ఒక్కరోజే 90 మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో 13 రోజులుగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 425కు చేరింది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటిదాకా ఐదుగురు సైనికులతో సహా ఏడుగురు ఇజ్రాయెలీలు చనిపోయారు. పరిస్థితి భీకరంగా మారిన నేపథ్యంలో మృతదేహాలు, క్షతగాత్రుల తరలింపు కోసం మానవతా దృక్పథంతో తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలంటూ రెడ్‌క్రాస్‌కు చెందిన అంతర్జాతీయ కమిటీ చేసిన విజ్ఞప్తికి ఇరుపక్షాలూ అంగీకరించాయి. అయితే హమాస్ మిలిటెంట్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని, తామూ అందుకు అనుగుణంగా స్పందించామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది.

షాజైయా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెలీ బలగాలు తూటాల వర్షం కురిపించడంతో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గాజా సిటీలోకి పారిపోయారు. జీతున్, జబాలియా ప్రాంతాల్లో ఇజ్రాయెలీ సేనలు అపార్ట్‌మెంట్ భవనాల్లోకి నేరుగా కాల్పులు జరపడంతో వేలాది మంది భయకంపితులయ్యారు. శుక్రవారం రాత్రి రఫా వద్ద హమాస్ మిలిటెంట్లు ఓ గాడిదకు పేలుడు పదార్థాలను కట్టి ఇజ్రాయెల్ బలగాల వైపు పంపించగా.. ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరిపి దానిని పేల్చివేశారు. కాగా, ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడుల్లో చనిపోయినవారిలో 112 మంది మైనర్లు, 41 మంది మహిళలు, 25 మంది వృద్ధులు ఉన్నారు.

Advertisement
Advertisement