చచ్చిపోయి కోర్టుకు వచ్చాడు | Sakshi
Sakshi News home page

చచ్చిపోయి కోర్టుకు వచ్చాడు

Published Thu, Jun 30 2016 7:21 PM

చచ్చిపోయి కోర్టుకు వచ్చాడు - Sakshi

జొహన్నస్బర్గ్: చీటింగ్, మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని పోలీసులతో పాటూ అందరూ భావించారు. అయితే మరణించాడనుకున్న వ్యక్తి ఏకంగా బుధవారం దక్షిణాఫ్రికాలో క్రుజర్స్డోర్ప్ కోర్టులో ప్రత్యక్షమవ్వడంతో అందరిని విస్మయానికి గురిచేసింది. 31 ఏళ్ల వ్యక్తి(పేరు వెల్లడించలేదు) గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు భావించారు. సంఘటనా స్థలంలో పూర్తిగా కాలిపోయిన ఓ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు.

మరణ వార్త విన్న స్నేహితులు, బంధువులు అతని ఫేస్ బుక్ పేజిలో నివాళులు కూడా అర్పించారు.మొత్తం సంతాప సందేశాలతో అతిని ఫేస్ బుక్ నిండిపోయింది. స్నేహితులు, బంధువులు అందరూ అతని మరణించాడేమే అని అతనితో ఉన్న జ్ఞాపకాలను ఫేస్బుక్ పేజీలో పంచుకున్నారు.

మరణించాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా కోర్టులో ప్రత్యక్షమవ్వడంతో బంధువులు, స్నేహితులతో సహా తెలిసినవారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. క్రుజర్స్డోర్ప్ మెజిస్ట్రేట్ ముందు పెరిగిన గడ్డం, చెవికి పోగుధరించి ఉన్న ఆ వ్యక్తి కోర్టులో విచారణకు హాజరయ్యాడు. ఈ నెల 26న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు లో హాజరపరిచారు. ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్కు, ఆ వ్యక్తి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కోర్టు అతన్ని వారం రోజులపాటూ పోలీస్ కస్టడీకి అప్పగించింది. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో లభించిన మృతదేహం ఎవరిది అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement
Advertisement