ఫోన్లో మాట్లాడినందుకు చెల్లిని చంపాడు | Sakshi
Sakshi News home page

ఫోన్లో మాట్లాడినందుకు చెల్లిని చంపాడు

Published Sat, Apr 30 2016 4:19 PM

ఫోన్లో మాట్లాడినందుకు చెల్లిని చంపాడు

కరాచి: ఇస్లాం మత రాజ్యమైన పాకిస్తాన్లో 'మర్యాద హత్యలు' (హానర్ కిల్లింగ్స్)' ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. కుల కట్టుబాటును తప్పినందుకో, పరాయి పురుషిడితో ప్రేమాయణం సాగిస్తూ దొరికిపోయినందుకో కాకుండా కేవలం పరులతో మాట్లాడినందుకు ఓ అన్న చెల్లిని వంటింటి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన కరాచి సమీపంలోని ఒరాంగి పట్టణంలో బుధవారం జరిగింది. హయత్ ఖాన్ అనే 20 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. సీనియర్ పోలీసు అధికారి అజ్ఫర్ మహేశర్ కథనం ప్రకారం సుమైరా అనే 16 ఏళ్ల యువతి ఇంటి ముందు మెట్ల వద్ద నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ హయత్ ఖాన్కు కనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఇంట్లో నుంచి విసురుగా వచ్చిన హయత్ ఖాన్ చెల్లిని ప్రశ్నించాడు.

'నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు?' అని సుమైరా ఎదురు ప్రశ్నించింది. అంతమాటకే ఆగ్రహోదగ్రుడైన అన్న హయత్ వంటింట్లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చి చెల్లిని పొడిచేసి గుమ్మం ముందుకు తోసేశాడు. బాటసారులు సుమైరాను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. జరిగిందేదో జరిగిపోయింది. నేను నా కొడుకును క్షమించేశాను' అని ఆ పిల్లల తండ్రి ఇనాయత్ ఖాన్ ఇంటికి దర్యాప్తునకు వచ్చిన పోలీసులకు చెప్పాడు. ఇలా చెప్పడం 2005 వరకు పాకిస్తాన్లో చెల్లుబాటు అవుతూ వచ్చింది. అంటే, ఇంతటి ఘోరాన్ని కూడా ఇంటి పెద్దలు క్షమించేస్తే నేరస్థుడికి ఎలాంటి శిక్ష ఉండేది కాదు. కనీసం విచారణ కూడా చేసేవారు కాదు.

2005లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇలాంటి కేసుల్లో పోలీసులే ప్రభుత్వం తరపున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలా చేసినంత మాత్రానా నేరస్థుడికి శిక్ష పడుతుందన్న గ్యారెంటీ లేదు. ఓ కేసులో తండ్రి లేదా కుటుంబ సభ్యులు నేరస్థుడిని క్షమించేస్తే నేరస్థుడిని శిక్షించాలా, వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ కోర్టు జడ్జీనే. జడ్జీ తలచుకుంటే నేరస్థుడిని వదిలేయవచ్చు. దేశంలో మర్యాద హత్యలను సమూలంగా నిర్మూలిస్తానని పాక్ ప్రధానమంత్రి నవాజ్  షరీఫ్ ఎన్నోసార్లు శపథం చేశారు.

నేరస్థులకు క్షమాభిక్ష చట్టాన్ని కూడా ఇంతవరకు మార్చలేక పోతున్నారు. 'నేను కావాలని చంపలేదు. పొడిచి బెదిరిద్దామని అనుకున్నాను. చనిపోయింది. నేను కూడా చావాలని కోరుకుంటున్నాను' అని చెల్లిని చంపిన అన్న హయత్ జైలు నుంచి మీడియాతో వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్లో కాకుండా పరులతో మాట్లాడం ఇప్పటికీ మగవాళ్లకు మింగుడుపడని సమస్యే.

Advertisement
Advertisement