'ఉగ్రవాదాన్ని పీకిపారేసేందుకు మేం రెడీ' | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాదాన్ని పీకిపారేసేందుకు మేం రెడీ'

Published Sun, Jul 9 2017 8:52 AM

'ఉగ్రవాదాన్ని పీకిపారేసేందుకు మేం రెడీ'

కైరో: ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ అన్నారు. అరబ్‌ దేశాలతోపాటు అంతర్జాతీయ సమాజానికి ఈ విషయంలో తాము సహకరిస్తామని చెప్పారు. అరబ్‌ లీగ్‌ ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ అబౌల్‌ గెయిట్‌తో కైరోలో శనివారం సమావేశం అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి ఎంఈఎన్‌ఏ అనే వార్తా సంస్థ తెలిపింది. ఈ సమావేశం తర్వాత ఆయన ఈజిప్టు విదేశాంగ మంత్రి సామేశ్‌ షౌక్రీతో కూడా భేటీ అయ్యారని ఆయనతో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

'తీవ్రవాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తున్న శక్తుల్లో పాలస్తీనా కూడా ఒక భాగం' అని అబ్బాస్‌ అన్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు గత పాలకులు చేసిన ప్రయత్నాలను, తాము చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణ చర్యలను నిలువరించగలిగామని, పాలస్తీనా పౌరుల హక్కుల స్థాపన జరిగిందని దీంతో ప్రస్తుతం జెరూసలెం, హెబ్రాన్‌ వంటి నగరాలను ప్రపంచ హెరిటేజ్‌ జాబితాలో యూనెస్కో చేర్చిందని వారికి గుర్తు చేశారు. ఉగ్రవాదం నిర్మూలించే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తమకు ముందునుంచి అండగా నిలుస్తున్న ఈజిప్టుకు ధన్యవాదాలని తెలిపారు.

Advertisement
Advertisement