అఫ్ఘాన్‌లో గ్రామం సమాధి | Sakshi
Sakshi News home page

అఫ్ఘాన్‌లో గ్రామం సమాధి

Published Sat, May 3 2014 3:09 AM

Afghanistan landslide 'kills at least 350'

భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు
350 మంది మృత్యువాత

 
 కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం భారీ వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగిపడటంతో ఓ గ్రామం సమాధి అయింది. బడాక్షాన్ ప్రావిన్స్‌లోని హోబో బరిక్ గ్రామం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 350 మంది మృత్యువాత పడ్డారని అఫ్ఘానిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ ప్రకటించింది. గ్రామంలోని 300 ఇళ్లపై బురద, మట్టి, రాళ్లు పడ్డాయని, శిథిలాల కింద 2 వేల మందికిపైగా గ్రామస్తులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు వెల్లడించారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 700 కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
 
 గ్రామంపై మధ్యాహ్నం ఒంటి గంటకు కొండ చరియలు విరిగిపడ్డాయని, దీంతో మూడొంతుల గ్రామం శిథిలాల కింద సమాధి అయిందని ప్రావిన్స్ గవర్నరు షా వలీలుల్లా అదీబ్ తెలిపారు. సమీపంలోని ఓ గ్రామంపై కూడా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఆ గ్రామం నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యల్లో అఫ్ఘాన్ ఆర్మీకి నాటో దళాలు కూడా సాయం చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అఫ్ఘాన్ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement