మరణం తర్వాతా జీవితం..! | Sakshi
Sakshi News home page

మరణం తర్వాతా జీవితం..!

Published Thu, Oct 9 2014 12:40 AM

మరణం తర్వాతా జీవితం..!

బతికుండగా.. చావు రాదు. చావు వచ్చాక బతికి ఉండలేం. అందుకే చచ్చిపోయాక ఏం జరుగుతోందన్నది మనకు తెలియదు. అయితే... మనిషి చనిపోయాక కూడా స్పృహ ఉంటుందంటున్నారు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు! మరణం సంభవించి మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన తర్వాత కూడా ఎరుక అనేది కొనసాగుతుందని వారు చెబుతున్నారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలలో కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)కు గురైన 2 వేల మందిపై అధ్యయనం చేసిన వీరు.. తిరిగి బతికినవారిలో 40 శాతం మందిలో గుండె ఆగిపోయిన తర్వాతా ఒకరకమైన స్పృహ కొనసాగినట్లు గుర్తించారు. కార్డియాక్ అరెస్టుకు గురై గుండె పూర్తిగా ఆగిపోయినవారిని వైద్యపరంగా మరణించినట్లుగానే భావిస్తారు. అయితే.. ఛాతీపై బలంగా నొక్కడం, కృత్రిమ శ్వాస ద్వారా ప్రయత్నిస్తే.. కొన్నిసార్లు ఇలాంటి వారి గుండె తిరిగి కొట్టుకుంటుంది.

వీరిలో ఓ మనిషి ఏకంగా.. తన శరీరంలో నుంచి బయటికి వచ్చి ఎదురుగా తన దేహానికి వైద్యులు చేస్తున్న చికిత్సను సైతం చూసినట్లు.. తిరిగి బతికిన తర్వాత చెప్పాడట. సాధారణంగా గుండె ఆగిపోయిన 20-30 సెకన్లకే మెదడు పనిచేయడం కూడా ఆగిపోతుందని, అయినా.. వీరిలో రెండు మూడు నిమిషాల తర్వాత కూడా ఎరుక ఉండటాన్ని తాము గుర్తించామని వీరు వెల్లడించారు. మృత్యువుకు చేరువైతే దాదాపు అందరికీ ఇలాంటి అతీంద్రియ అనుభవాలు కలగవచ్చని, కానీ.. మందులు, చికిత్సలు, ఇతర అంశాల వల్ల వాటిని రోగులు మరిచిపోతుండవచ్చని అంటున్నారు.
 
 

Advertisement
Advertisement